రూ.12 కోట్ల భూమి  కోటీ 20 లక్షలకే!

రూ.12 కోట్ల భూమి  కోటీ 20 లక్షలకే!
  • ముదురుతున్న లొల్లి  ఏకపక్షంగా బోర్డు
  • భూముల అమ్మకంపై ఆరోపణలు
  • చలో పూడూర్​కు కదిలిన ప్రతిపక్ష నేతలు

మెట్​పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్మన్​గా ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు రూ.12 కోట్ల విలువైన భూములను రూ.1.2 కోట్లకు అమ్మేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జగిత్యాల/కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ లోని మెట్​పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ కు చెందిన విలువైన భూముల అమ్మకం వివాదాస్పదమవుతోంది.  ఖాదీ ప్రతిష్టాన్​కు చైర్మన్​గా ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు రూ. 12 కోట్లకు పైగా విలువైన భూములను వేలం వేయకుండా ఏకపక్షంగా రూ. 1.2 కోట్లకు తన అనుచరులకు కట్టబెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ భూవిక్రయంపై ఏసీబీ, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లెటర్​రాసినా స్పందన లేకపోవడంతో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో గురువారం ఖాదీ భూముల పరిరక్షణ పేరుతో ‘చలో పూడూర్ ’ కార్యక్రమం నిర్వహించారు. 
ఏం జరిగిందంటే..
ఈ ఏడాది ఏప్రిల్ 2న ఖాదీ బోర్డు చైర్మన్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలోని  సర్వే నంబర్ 171/బీలో, ఇంటి నంబర్లు 7-14/1, 2, 3, 4, 5 గా ఉన్న ఖాదీ బోర్డుకు సంబంధించిన ఎకరా 17 గుంటల భూముల లావాదేవీలపై బోర్డు మెంబర్ సెక్రెటరీ ఇప్పనపల్లి సాంబయ్యకు హక్కు కల్పిస్తూ  మల్యాల సబ్ రిజిస్ర్టార్​కు లెటర్ ​రాశారు. ఆ మరుసటి రోజే ఏప్రిల్​3న సాంబయ్యతో డాక్యుమెంట్ నంబర్ 473/2021 ద్వారా రూ. 1.2 కోట్లకు కొడిమ్యాల ఎంపీపీ స్వర్ణలత పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఖాదీ బోర్డు చైర్మన్ హోదాలో ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఎలాంటి వేలం పాట వేయకుండా ఏకపక్షంగా భూములను అమ్మడం వివాదాస్పదమైంది. ఈ భూములను కొన్న  రాజా నర్సింగరావు(కొడిమ్యాల సింగిల్ ​విండో చైర్మన్), ఆయన భార్య స్వర్ణ లత(కొడిమ్యాల ఎంపీపీ) ఇద్దరూ టీఆర్ఎస్​లీడర్లు కావడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. 
60 ఏళ్ల చరిత్ర ఖతం.. 
పూడూర్​ భూముల అమ్మకాలతో 60 ఏండ్ల చరిత్ర కలిగిన ఖాదీ బోర్డ్  కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ ఖాదీ బోర్డ్  చేనేత వస్త్రాల తయారీ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో నంబర్ వన్ గా ఉండేది.  మాల్యాల, బోయినపల్లి, రామడుగు, గంగాధర మండలాల్లోని ఎంతో మంది చేనేత కుటుంబాలను ఆదుకున్నది. క్రమంగా చేనేత వస్త్రాలకు డిమాండ్ తగ్గడంతో నేత కార్మికులు మహారాష్ట్ర లోని భీమండి, సిరిసిల్ల కు వలస వెళ్లారు. ఈలోగా ఖాదీ బోర్డు భూముల రేట్లకు అమాంతం రెక్కలు రావడం తో ఇదే అదనుగా రూలింగ్​పార్టీ లీడర్లు వాటిపై కన్నేశారని ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు.
సీఎంకు లెటర్ ​రాసినా పట్టించుకోలే..
భూముల అమ్మకాలపై ఏసీబీ, విజిలెన్స్​విచారణ చేపట్టాలనే డిమాండ్​తో గురువారం ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​లీడర్లు ‘చలో పూడూర్’​ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీవన్​రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్​ విషయంలో సామాన్యులు ఫిర్యాదు చేస్తే ఆగమేఘాలపై కదిలిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీగా తాను లెటర్​రాసినా పట్టించుకోలేదన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వ ఆస్తిని ఎలాంటి ప్రకటన లేకుండా అమ్మడం దారుణమన్నారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్​ నేతలు కలిసి రూ.12 కోట్లు విలువ చేసే భూమిని దొంగచాటుగా కేవలం రూ. 1.25 కోట్లకు కొట్టేశారని, ఇందులో నిజానిజాలను వెలికి తీసేందుకు ఏసీబీ, విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్​ చేశారు.
భూములు అమ్మేసి ఖాదీని అభివృద్ధి చేస్తాం 
ఖాదీ ప్రతిష్టాన్​లో అక్రమాలకు తావు లేదు. పనికిరాని స్థలాలను అమ్మేసి డిమాండ్ ఉన్న ప్రాంతంలో కమర్షియల్ బిల్డింగులు కడ్తున్నాం. తద్వారా ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. ఈ భూమి అమ్మాలని గత చైర్మన్ రాజేశ్వర్ రావు హయాం 2014లోనే తీర్మానం చేశారు. 57 గుంటల భూమికి రూ.12 కోట్లు వస్తాయని చెబుతున్న నేతలు రూ. 6 కోట్లు ఇస్తే ఇచ్చేస్తాం.  – విద్యాసాగర్​రావు, ఎమ్మెల్యే, 
ఖాదీ బోర్డు చైర్మన్
మా జాగా మాకే ఉండాలే 
పూడూర్ ఖాదీ బోర్డు జాగాను మాకు తెలియకుండానే ఇతరులకు అమ్మేసిన్రు. ఇది కరెక్ట్​ కాదు. మా స్థలం మాకే కావాలి. మేమే దీన్ని డెవలప్ చేసుకుంటం. మా తాతలు, తండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం.  – వీరబత్తిని అంజయ్య, నేత కార్మికుడు, పూడూర్, కొడిమ్యాల