విలక్షణ నటుడికి కన్నీటి వీడ్కోలు..ముగిసిన కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు

విలక్షణ నటుడికి కన్నీటి వీడ్కోలు..ముగిసిన కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు

తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో విశేష స్థానం సంపాదించుకున్న కోటా శ్రీనివాస రావు అంత్యక్రియలు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి.

కోటా అంతిమ యాత్ర ఆదివారం (జూలై13) మధ్యాహ్నం 3గంటలకు ఫిలింనగర్ లో ఫిలించాంబర్ నుంచి మొదలైంది.. సాయంత్రం 5.00 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. సిని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నవరసాల కోటకుకన్నీటి వీడ్కోలు పలికారు. 

ALSO READ | కోట సినీ పరిశ్రమకు ఒక డిక్షనరీ.. నేటి తరం నటులు ఆయన పుస్తకాన్ని చదవాల్సిందే..!

‘ప్రాణం ఖరీదు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన కోటా.. అంచెలంచెలుగా ఎదిగారు. ‘ప్రతి ఘటన' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సిని రంగ ప్రవేశానికి ముందు వెయ్యికి పైగా నాటకాల్లో రాణించిన కోటా నాటక రంగంలోకూడా తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళ, హిందీ, కన్నడ, మళయాళంలో 700కి పైగా చిత్రాల్లో నటించినకోటా.. 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో  సత్కరించింది. 

కోటా శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కోట శ్రీనివాస్ రావుకు మెగాస్టార్ చిరంజీవి నివాళి అర్పించారు. కోట భౌతిక కాయాన్ని సందర్శించిన చిరు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోట లెజండరీ యాక్టర్ అని అన్నారు. కోటా,తాను ప్రాణం ఖరీదుతోనే సినీ కెరీర్ మొదలు పెట్టామని చెప్పారు చిరంజీవి.  కోటకు నివాళి అర్పించడానికి  పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు.

కోట మరణం విచారకరం

కోట శ్రీనివాస్ మరణం విచారకరమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవాళ ఉదయం కోట భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన..కోట  గొప్ప నటుడని  మానవతావాది అని అన్నారు. విలక్షణమైన పాత్రలు పోషించి... ప్రజా అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు.  అయన సినిమాలో కనిపిస్తే హాస్యం పండేది,  అయన కుమారుడి మరణంతో కుంగిపోయారు. కొన్ని ప్రమాణాలు, పద్ధతులు గల నటుడిని  సినిమా రంగం కోల్పోయిందన్నారు.  కోట శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోదైర్యం ఇవ్వాలని కోరారు. 

ముక్కుసూటి మనిషి

కోట మృతిపట్ల సినీ నిర్మాత అల్లు అరవింద్ సంతాపం తెలిపారు. కోట భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. .కోట శ్రీనివాస్ రావుతో   దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. రౌడీ అల్లుడులో కోటా మంచి పాత్ర వేశారని.. కోటా శ్రీనివాస్   నాన్న అల్లు రామలింగయ్యతో చాలా సాన్నిహిత్యంగా ఉండేవారన్నారు. కోట  శ్రీనివాస్ ముక్కు సూటిమనిషి అని అన్నారు అరవింద్.