వైభవంగా కొత్తకొండ జాతర

వైభవంగా కొత్తకొండ జాతర

భీమదేవరపల్లి, వెలుగు: ఉత్తర తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. గుమ్మడికాయలు, కోడెమొక్కులు, మేకల రథాలు, కొత్తపల్లి రథాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రూ.ఐదు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ ఏడాది ఉచిత వీఐపీ దర్శనం రద్దుతో అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సంక్రాంతి, కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్,స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,హుస్నాబాద్​ మాజీ ఎమ్మెల్యే సతీశ్ ​కుమార్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అదనపు ​ కలెక్టర్లు రాధికా గుప్తా, శ్రద్ధా శుక్ల, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ఈ వీరభధ్రుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ శ్రావణ మాసంలో వీరభధ్రుడి నక్షత్ర దీక్ష తీసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. గత పాలనలో చాలా ప్రాధాన్యం ఉన్న దేవాలయాలను అభివృద్ది చేయలేకపోయారని, తమ ప్రభుత్వం తప్పకుండా ఆ ఆలయాలను డెవలప్​ చేసి చూపుతుందన్నారు. కాగా, బీఆర్ఎస్​ పాలనలోనే ఆలయాలు డెవలప్  అయ్యాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా ఆలయాల అభివృద్దికి నిధులు కేటాయించాలని కోరారు.

దేవుడిని మొక్కుదాం, మొక్కను పెంచుదాం

గత ఏడేండ్లుగా ‘దేవుడిని మొక్కుదాం, మొక్కను పెంచుదాం’  నినాదంతో వృక్షప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్​ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ఏడాది వృక్షప్రసాద పంపిణీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్​ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 

75 ఏండ్ల చరిత్రకు 75 ప్రత్యేక రథాలు 

జాతర చరిత్రలో 75 ఏండ్లయిన సందర్భంగా 75 రథాలు కట్టి మొక్కులు చెల్లించారు. ఈ ఏడాది కూడా ఎద్దులు, బండ్లను అందంగా అలకరించి ప్రభలతో వరుస సంఖ్యలో పోలీసు బందోబస్తు మధ్య ఏడు గంటల పాటు జాతర వరకు రథయాత్ర కొనసాగింది.