చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి

వైసీపీ రెబల్ లీడర్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన  పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  తాజాగా జరిగిన  ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

ఈ గెలుపు గాలి మాత్రమేనని రాబోయే ఎన్నికల్లో సునామీ వస్తుందని చెప్పారు.ఈ సునామీలో వైసీపీ లీడర్లు అడ్రస్‌ లేకుండా కొట్టుకొనిపోవడం ఖాయమని  చంద్రబాబు అన్నారు. ప్రజల్లో నిరంతరం ఉంటూ సమాజానికి సేవ చేయాలనే తపన ఉండే వ్యక్తి గిరిధర్‌రెడ్డి అని చంద్రబాబు  అన్నారు. వైసీపీ సేవ దళ అధ్యక్షుడే ఆ పార్టీకి రాజీనామా చేశాడంటే ఆ పార్టీ మిగతా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 

టీడీపీ కుటుంబంలో తనని భాగస్వామిని చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు  కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి . రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్న ఆయన...  అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాకే టీడీపీలో చేరానని తెలిపారు.  వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. .