వనమాకు సహాయ నిరాకరణ

వనమాకు సహాయ నిరాకరణ
  •       రాఘవ వస్తే ప్రచారానికి రామంటున్న కౌన్సిలర్లు 
  •       వారం రోజులుగా ప్రచారానికి దూరం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం బీఆర్ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ప్రచారంలో స్థానిక కౌన్సిలర్లు సహకరించడం లేదు. మున్సిపాలిటీ చైర్మన్ కె. సీతాలక్ష్మితో పాటు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు వారం రోజులుగా సహాయ నిరాకరణ పాటిస్తూ పార్టీలో కలకలం సృష్టిస్తున్నారు. వనమా కొడుకు రాఘవ, ఇతర మండలాల ప్రజాప్రతినిధులు ప్రచారానికి వస్తే తాము రాబోమని స్పష్టం చేస్తున్నారు. 

పార్టీ నుంచి సస్పెండ్​ అయిన వాళ్లు తమ మీద పెత్తనం చెలాయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కొత్తగూడెం టౌన్​లో ఎన్నికల ప్రచారానికి వనమాతోపాటు నియోజకవర్గ ఇన్​చార్జి వద్దిరాజు మాత్రమే రావాలంటూ కౌన్సిలర్లు పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. 

సీక్రెట్ మీటింగ్స్..​

మున్సిపాలిటీలో 36 వార్డులకు గానూ 25 మంది బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కొడుకు వనమా రాఘవతో పాటు కొందరు బీఆర్​ఎస్​ నేతలు చెప్పిందే వేదంగా విన్నారు. కానీ వారం రోజులుగా సహాయ నిరాకరణ చేస్తుండడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. మున్సిపల్​ చైర్మన్​తో పాటు కౌన్సిలర్లంతా ఇటీవలి కాలంలో పట్టణంలోని పవర్​ హౌజ్​ బస్తీలో ఒక సారి, చైర్మన్​ ఇంట్లో మరోసారి సీక్రెట్​ మీటింగ్​పెట్టుకున్నారు. 

టౌన్​లో ఎమ్మెల్యే ప్రచారం చేసే టైంలో ఆయన కొడుకు రాఘవ, జడ్పీ వైస్​ చైర్మన్​, ఎంపీపీలు, ఆత్మ కమిటీ చైర్మన్​, వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​తో పాటు ఇతరత్రా టౌన్​తో సంబంధం లేని నాయకులు రావద్దంటూ నిర్ణయించారు. వారందరితో కలిసి వస్తే తాము ప్రచారానికి రాబోమని ఖరాఖండిగా చెప్పారు. టౌన్​ నేతలతో పాటు తామే వార్డుల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రచారం చేస్తామని చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్​చార్జి​ వద్దిరాజుకు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. 

వెహికల్స్​ ద్వారానే ప్రచారం

వారం రోజులుగా కొత్తగూడెం పట్టణంలోని బస్తీల్లో బీఆర్​ఎస్​ ఇంటింటి ప్రచారం కరువైంది. కేవలం వెహకల్స్​ ద్వారానే ప్రచారం కొనసాగుతోంది. చైర్మన్​తో పాటు కౌన్సిలర్లు సహాయ నిరాకరణ చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కొడుకు, ఇతరత్రా లీడర్లు  వారితో చర్చలు జరిపేందుకు ముందుకు రాకపోవడం పట్ల మరింత సీరియస్​గా ఉన్నారు. కొత్తగూడెంలో బీఆర్​ఎస్​ పార్టీకి సంబంధించి ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యేతో పాటు ఆయన కొడుకు రాఘవ, ఒకరిద్దరు నేతలు తప్పనిసరిగా అటెండ్​ అవుతుంటారు. 

వారు లేకుండా ఎటువంటి పార్టీ కార్యక్రమం ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు లేవు. కాగా రెండు రోజుల కింద సీపీఐ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు  హైదరాబాద్​లో కేటీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు.  వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రామ్ లో​ఎమ్మెల్యే, ఆయన కొడుకు రాఘవ లేకుండా మొదటి సారిగా చైర్మన్​, కౌన్సిలర్లు పట్టణంలోని జిల్లా పార్టీ ఆఫీస్​లో ప్రెస్​మీట్​ పెట్టడం గమనార్హం.