ముర్రెడు కరకట్టల పనులు మూడేండ్లైనా ముందుకు కదలట్లే!

ముర్రెడు కరకట్టల పనులు మూడేండ్లైనా ముందుకు కదలట్లే!
  • రూ. 30 కోట్ల నుంచి రూ. 50కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
  • కొత్తగూడెం పట్టణంలో కోతకు గురవుతున్న వాగు 
  • కూలుతున్న ఇండ్లు.. భయం గుప్పిట్లో స్థానికులు 
  • రానున్నది వానాకాలం.. ఇంకా మొదలు కాని పనులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణానికి ముర్రేడు వాగు ముప్పు ముంచుకొస్తోంది. మూడేండ్లైనా కరకట్టల పనులు ముందుకు కదలకపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. వరద ఉధృతితో వాగుకు ఇరువైపులా కోతకు గురవుతోంది. వానాకాలం దగ్గర పడుతున్నా కొద్దీ కొత్తగూడెంతోపాటు లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్, సంజయ్​ నగర్, హమాలీకాలనీల్లోని వాగు పక్కన్న ఉన్న ఇండ్లలోని ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. 

20కిపైగా కూలిన ఇండ్లు

కొన్నేండ్లుగా ముర్రేడు వాగు ఉధృతి పెరుగుతోంది. దీంతో  వాగుకు ఇరువైపులా భూమి కోతకు గురై ఇప్పటికే 20కిపైగా ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని దెబ్బతిన్నాయి. ఓ రైతుకు సంబంధించి దాదాపు నాలుగు ఎకరాలకు పైగా భూమి కోతకు గురైంది. వాగుకు ఆనుకొని ఉన్న భూముల్లోని మోటార్లు వాగులో కొట్టుకుపోయాయి.

2023లో ప్రపోజల్స్​

2023లో నాటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అప్పటి సీఎం కేసీఆర్​ కొత్తగూడెంలో పర్యటించి కరకట్టల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలంటూ ఇరిగేషన్​ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో అధికారులు రూ. 150కోట్లతో ప్రపోజల్స్​ పంపించారు. ఉన్నతాధికారులు ఎస్టిమేషన్లను పరిశీలించి కరకట్టలను కొత్త టెక్నాలజీతో నిర్మించేలా ప్లాన్​ చేయాలని, తిరిగి ఎస్టిమేషన్లు పంపించాలంటూ స్థానిక ఆఫీసర్లకు సూచించారు. దీంతో రూ.30కోట్లతో ప్రపోజల్స్​ పంపించారు.  

రూ. 30కోట్లు సాంక్షన్​ అయినట్టుగానే వనమా పేర్కొన్నారు. ఈ లోపు ఎన్నికలొచ్చాయి. వనమా ఓడిపోయి కాంగ్రెస్​ బలపర్చిన సీపీఐ అభ్యర్థి కూనంనేని విజయం సాధించారు. ముర్రేడు వాగుకు ఇరువైపులా కరకట్టల నిర్మాణాలపై స్పెషల్​ ఫోకస్​ పెడుతున్నట్టుగా కూనంనేని పేర్కొన్నారు. ఇరిగేషన్​ ఆఫీసర్లతో కలిసి వాగును పరిశీలించారు. మరోసారి ప్రపోజల్స్​ పెట్టాలని సూచించారు. కానీ ఫండ్స్​సాంక్షన్​ 
కాలేదు. 

పెరిగిన ఎస్టిమేషన్... 

కరకట్టల నిర్మాణాలకు మొదట రూ. 30కోట్లు అనుకున్నప్పటికీ ప్రస్తుతం అంచనా వ్యయం 
రూ. 50కోట్లకు చేరింది. కానీ పనులు మాత్రం ఇంకా మొదలు కావడం లేదు. దీంతో స్థానికులు ఆందోళనకు గురువుతున్నారు. వానాకాలం దగ్గరపుడుతున్న పనులు ప్రారంభం కాకుంటే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి కరకట్టల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి 
సారించాలని ప్రజలు కోరుతున్నారు. 

ఎస్టిమేషన్​ పంపించాం

ముర్రేడు వాగుకు ఇరువైపులా భూమి కోతకు గురవుతున్నందున కరకట్టల నిర్మాణాలకు గతంలో రూ. 30కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు మరోసారి ప్రపోజల్స్​ పంపించాం. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.50కోట్లకు చేరింది. ప్రభుత్వం నుంచి సాంక్షన్​ ఆర్డర్​ వస్తే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడ్తాం. 

అర్జున్​, ఈఈ, ఇరిగేషన్​ కొత్తగూడెం