చీరలు నచ్చకుంటే వెళ్లిపోండి.. మహిళలపై ఎంపీపీ ఆగ్రహం

చీరలు నచ్చకుంటే వెళ్లిపోండి.. మహిళలపై ఎంపీపీ ఆగ్రహం

వనపర్తి: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది. అయితే కొన్నిచోట్ల నాసిరకం చీరలు పంపిణీ చేస్తుండటంతో మహిళలు గొడవకు దిగుతున్నారు. తాజాగా.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో అలజడి రేగింది. నాణ్యత లేని చీరలు తమకొద్దని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఎంపీపీ మౌనిక.. స్థానిక మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవమానకరంగా మాట్లాడారు. చీరలు వద్దనుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎంపీపీ వ్యాఖ్యానించారు. అదేవిధంగా చీరలు వద్దన్న వాళ్లందరికీ పింఛన్లు కూడా ఇవ్వొద్దని అధికారులకు హుకుం జారీ చేశారు. చీరలు ప్యాక్ చేసి వెనకకు తీసుకెళ్లాలని.. ఎవరికీ చీరలు ఇవ్వొద్దని ఆర్ఐని ఆదేశించింది. దాంతో స్థానిక మహిళలు ఆగ్రహంతో సమావేశం నుంచి శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. వెంటనే స్పందించిన జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మహిళలను రమ్మని పిలిచినా ఎవ్వరు తిరిగి రాలేదు. దాంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.