
ఆసిఫాబాద్, వెలుగు: అధికారుల తీరుతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని.. సొంత గ్రామాలకే రోడ్లు వేసుకోలేక పోతున్నామని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయీ సంఘం సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.తిర్యాణి మండలం గుండాల గ్రామానికి మూడేళ్ల కిందటే రోడ్డు మంజూరైందని.. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. ఎన్నికల్లోగా రోడ్డు వేయకుంటే బ్యాలెట్ డబ్బాలను ఊర్లోకి రానివ్వమంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆర్ అండ్ బీ ఈఈ పెద్దన్న పై ఆమె ఫైర్ అయ్యారు.
అటవీశాఖ అధికారులు రోడ్లు, బోర్ వెల్స్ వేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. మంగి, ముల్కలమంద ఆదివాసీ గ్రామాల్లో మంచినీటి కోసం బోర్ వెల్ వేస్తుంటే అధికారులు అడ్డుకోవడం సరికాదన్నారు. రాత్రికి రాత్రే అడవుల నుంచి కలప తరలిపోతుంటే పట్టించుకోని ఫారెస్ట్ఆఫీసర్లు అమాయకులైన ఆదివాసులపై కేసులు పెడుతున్నారని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ యోగేశ్, సూపరింటెండెంట్ రాజశేఖర్ లపై మండిపడ్డారు. జంతువులకు ఇచ్చే ప్రాధాన్యత ఆదివాసులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్లు అందరికీ అందడం లేదని, రిపేర్లు ఉంటే త్వరగా పూర్తి చేసి తాగునీరు ఇవ్వాలన్నారు. కాగజ్ నగర్ డివిజన్ లో యాసంగి పంటలకు ఎరువులు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ వైస్‌చైర్మన్ కోనేరు కృష్ణ, జడ్పీటీసీ లు అరిగేల నాగేశ్వరరావు, అజేయ్ పాల్గొన్నారు.