
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే కేవలం కోయంబేడు మార్కెట్ లింక్ తోనే 2,600పైగా కేసులు నమోదైనట్లు ప్రత్యేక నోడల్ అధికారి తెలిపారు. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన కోయంబేడు మార్కెట్‌లో కరోనా కేసులు రావడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అందులో 2,600 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. అర్బన్ స్లమ్స్ ఏరియాల్లో కరోనాను నివారించడం పెద్ద సవాలే అని నోడల్ ఆఫీసర్ అన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, ఫేస్ మాస్కు ధరిస్తే కరోనాను కట్టడి చేయొచ్చని ఆయన చెప్పారు.
కాగా, గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్తగా 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో 66 మంది మరణించగా.. 2,240 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.