అట్లయితేనే అక్రమ ప్రాజెక్టులు ఆపగలం

అట్లయితేనే అక్రమ ప్రాజెక్టులు ఆపగలం

హైదరాబాద్‌‌, వెలుగు: కేఆర్‌‌ఎంబీ గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ షెడ్యూల్‌‌ -2లోని ప్రాజెక్టులన్నీ అప్పగించాలని, అప్పుడే అక్రమ ప్రాజెక్టులను ఆపగలమని కృష్ణా బోర్డు తేల్చిచెప్పింది. ఈ మేరకు బోర్డు ఎస్‌‌ఈ అశోక్‌‌ కుమార్‌‌ తెలంగాణ, ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీలకు శుక్రవారం లేఖ రాశారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ.. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ కంప్లయింట్లు చేసుకుంటున్నాయి తప్ప ప్రాజెక్టులను బోర్డు నిర్వహణకు అప్పగించట్లేదని మండిపడ్డారు. ఏపీ చేపట్టిన సంగమేశ్వరం ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణ, ఆర్డీఎస్‌‌ కుడి కాలువ, వెలిగొండ టన్నెల్‌‌ సహా పలు ప్రాజెక్టులపై తెలంగాణ... తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి,  నాగార్జున సాగర్‌‌ బ్యాక్‌‌ వాటర్‌‌పై ప్రాజెక్టుల విస్తరణపై ఏపీ బోర్డుకు ఫిర్యాదు చేశాయి.

ఆయా పనులు ఆపేసి, డీపీఆర్‌‌లు ఇచ్చి అవసరమైన అనుమతులు తీసుకోవాలని బోర్డు పలు సందర్భాల్లో 2 రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆయా ప్రాజెక్టులను తమకు హ్యాండోవర్‌‌ చేయకుంటే చర్యలు చేపట్టలేమని చెప్పింది. 2 రాష్ట్రాలు చేసుకున్న ఫిర్యాదుల లేఖలను దీనికి రెఫరెన్స్‌‌గా పేర్కొంది. కాగా, 2021 జులై 15న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం గెజిట్‌‌ ఇచ్చింది. 6 నెలల్లోపు అనుమతి లేని జాబితాలో ఉన్న ప్రాజెక్టులకు పర్మిషన్లు తీసుకోవాలని పేర్కొంది. ఈ గడువును ఇంకో 6 నెలలు పొడిగించగా.. ఆ గడువూ గురువారమే పూర్తయింది. ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేస్తే 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు ముగింపు పలికే అవకాశముందని కేంద్రం గెజిట్‌‌లో పేర్కొంది. కానీ ఏడాదైనా గెజిట్ అమలుపై ముందడుగు పడలేదు.