కాళేశ్వరంపై సర్కారు స్పందించాలె: కృష్ణప్రసాద్

కాళేశ్వరంపై సర్కారు స్పందించాలె: కృష్ణప్రసాద్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడుతున్న నిర్మాణపరమైన లోపాలపై రాష్ర్ట ప్రభుత్వం స్పందించాలని బీజేపీ అధికార ప్రతినిధి, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. అన్నారం దగ్గరున్న సరస్వతి బ్యారేజీలో 28, 38 గేట్ల పిల్లర్ల దగ్గర బుంగలు పడినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. బుధవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల ప్రజా ధనం వృథా అయిందని, అప్పులు, కరెంట్ బిల్లులకు ఏటా వేల కోట్లు ఖర్చు అవుతోందన్నారు. 

నీటి ఒత్తిడి ఎక్కువ అయితే ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందనే సమాచారం ఉందన్నారు. అధికారులు అక్కడికి సిబ్బందిని పంపి ఇసుక సంచులు వేసి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఈ వీడియోలు సైతం బయటకు వచ్చాయన్నారు. ఇటీవల మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని, అది మరువక ముందే సరస్వతి బ్యారేజ్ లో బుంగలు పడ్డాయన్నారు. 

ఈ డ్యామేజ్ లు ఎందుకు జరుగుతున్నాయి?  వీటికి డిజైన్స్ లోపాలే కారణమా? ఇంకేమైనా కారణాలున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీని11.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రారంభించారని, అయితే గతంలో భారీ వర్షాలకు బ్యారేజీ మోటార్లన్నీ వరద నీటిలో మునిగాయన్నారు. రిపేర్ల ఖర్చు ఎవరు భరించాలన్నది విషయం కాదని, డిజైన్స్ ఇచ్చిన ఇంజనీర్లు ఎవరని ప్రశ్నించారు. క్వాలిటీతో ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ కి తగిన సమాధానం చెప్పేందుకు వెయిట్ చేస్తున్నారని చెప్పారు.