
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 24న చెన్నై తాగునీటిపై ఏర్పాటు చేసిన కమిటీతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయ్‌పురే సభ్యులకు మంగళవారం లేఖ రాశారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈఎన్సీలు, సీడబ్ల్యూసీ సీఈలు సమావేశంలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 20లోగా ఎజెండా అంశాలను పంపాలని సూచించారు. గత ఒప్పందం ప్రకారం.. మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీల చొప్పున చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద జలాల్లోంచి తాము ఇవ్వాల్సిన 5టీఎంసీలను వినియోగంలోకి తీసుకోవాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు కృష్ణా బోర్డుకు తెలిపాయి. చెన్నై వాటర్ సప్లయ్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి తమను తప్పించాలని విజ్ఞప్తి చేశాయి. దీంతో గతంలో జరిగిన సమావేశాలకు ఈ రాష్ట్రాల నుంచి సభ్యులెవరూ హాజరుకాలేదు.