కేంద్రం కోర్టులోకి  నీటి వాటాల పంచాయితీ

కేంద్రం కోర్టులోకి  నీటి వాటాల పంచాయితీ

 

  • కేంద్రం కోర్టులోకి  నీటి వాటాల పంచాయితీ
  • కేఆర్ఎంబీ మీటింగ్​లో నిర్ణయం
  • 50% నీటి వాటా కోసం పట్టుబట్టిన తెలంగాణ
  • 66:34 నిష్పత్తిలో పంపకాలు చేయాలన్న ఏపీ

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల పంపకాల పంచాయితీ కేంద్రానికి చేరింది. కేఆర్ఎంబీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జలసౌధలో బుధవారం మధ్యాహ్నం బోర్డు చైర్మన్​ నందన్​ కుమార్​అధ్యక్షతన కేఆర్ఎంబీ 17వ సమావేశం నిర్వహించారు. తెలంగాణ నుంచి స్పెషల్​ సీఎస్​ రజత్​ కుమార్, ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఏపీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్​ కుమార్, ఈఎన్సీ (ఇరిగేషన్) నారాయణ రెడ్డి, రెండు రాష్ట్రాల ఇంజినీర్లు, బోర్డు సభ్యులు మీటింగ్​లో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై సుదీర్ఘంగా చర్చించారు. 2015లో చేసిన అడ్ హక్ ​కేటాయింపులు ఇంకా కొనసాగించడానికి వీల్లేదని, మూడేండ్లుగా తాము 50 శాతం వాటా కోరుతున్నామని తెలంగాణ సభ్యులు పట్టుబట్టారు. బచావత్ ​ట్రిబ్యునల్ ​ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు చేసిన కేటాయింపుల ఆధారంగానే అడహక్​కేటాయింపులు చేశారని.. ఇప్పుడు ఉన్నట్టే 66 : 34 (ఏపీ : తెలంగాణ) నీటి వాటాలు ఉండాలని ఏపీ సభ్యులు కోరారు. 

2023–24కు బోర్డు మెం బర్ ​సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన త్రీమెంబర్​కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించి వాటర్​రిలీజ్​ఆర్డర్​ ఇస్తుందని, రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేల్చే అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా బోర్డు ఏర్పాటు చేసే నాటికి తెలంగాణ నీటి వినియోగం తక్కువగా ఉండేదని అందుకే అప్పుడు 299 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకరించామని తెలంగాణ సభ్యులు తెలిపారు. ఇప్పుడు కల్వకుర్తి (40 టీఎంసీలు), ఎస్ఎల్బీసీ (40 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు) అందుబాటులోకి వచ్చాయి కనుక వాటికి ఇంకో వంద టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ సభ్యులు కోరగా ఏపీ మెంబర్లు వ్యతిరేకించారు. నీటి కేటాయింపులు చేసే అధికారం బోర్డుకు లేదని, ట్రిబ్యునల్ ​తేల్చాలని స్పష్టం చేశారు.

ఆర్​ఎంసీ పునరుద్ధరణ

తమ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేస్తామని, శ్రీశైలం నుంచి 34 టీఎంసీలకు మించి ఏపీ తీసుకోకుండా కట్టడి చేయగలిగితే కరెంట్ ఉత్పత్తిపై చర్చించేందుకు సిద్ధమని తెలంగాణ స్పష్టం చేసింది. తమ రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీల నికర జలాలను ఎక్కడి నుంచైనా ఉపయోగించుకునే అవకాశం ఉందని, దానిని కట్టడి చేయడానికి వీల్లేదని ఏపీ సభ్యులు తెలిపారు. ఏ ప్రాజెక్టు కిందైనా మొదట ఇరిగేషన్ అవసరాలు తీరిన తర్వాతే కరెంట్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరెంట్​ఉత్పత్తి, ప్రాజెక్టుల ఆపరేషన్​ప్రొటోకాల్​(రూల్​కర్వ్స్), సర్​ప్లస్​ డేస్​లో వినియోగించుకున్న నీటిపై నిర్ణయించేందుకు బోర్డు సభ్యుడు గుప్తా చైర్మన్​గా ఆర్ఎంసీని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆర్ఎంసీ చైర్మన్​గా వ్యవహరించిన రవికుమార్​ గుప్తా ఇచ్చిన నివేదికతో నిమిత్తం లేకుండా ఈ అంశాలపై కొత్త ఆర్ఎంసీ నెలలోపు సమావేశమై మళ్లీ చర్చించాలని సూచించారు. ఏపీ సభ్యులు ఇందుకు ససేమిరా అనగా, గత ఆర్ఎంసీ నివేదిక తమ ఆమోదం లేకుండానే సమర్పించారని తెలంగాణ సభ్యులు అభ్యంతరం తెలిపారు. 

పాలమూరు - రంగారెడ్డిపై అభ్యంతరాలెందుకు?

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులపై సీడబ్ల్యూసీకి డీపీఆర్​ఇచ్చాం. దీనిపై బోర్డు ముందు ఏపీ అభ్యంతరాలు లేవనెత్తడాన్ని తప్పు బట్టాం. కర్నాటకలో అప్పర్ ​భద్రకు ఇచ్చినట్టే పాలమూరుకు పర్మిషన్​ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. సుంకిశాల ఇన్​టేక్ ​వెల్ ​డ్రింకింగ్​ వాటర్ ​ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరాలను బోర్డు కూడా తోసిపుచ్చింది. రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్​ కుడి కాలువ పనులు ఆపేశామని ఏపీ సభ్యులు సమావేశంలో తెలిపారు. ఆర్డీఎస్​కు అత్యవసరంగా రిపేర్లు చేపట్టాలని నిర్ణయించాం.

- రజత్​కుమార్, తెలంగాణ ఇరిగేషన్​ స్పెషల్ ​సీఎస్

ఆ 45 టీఎంసీలు మాకే దక్కుతయ్

పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటికి బదులుగా నాగార్జునసాగర్​కు ఎగువన 80 టీఎంసీల నికర జలాల్లో 45 టీఎంసీలు మా రాష్ట్రానికే దక్కుతాయి. బచావత్​ ట్రిబ్యునల్​45 టీఎంసీలు లోయర్​రైపేరియన్​ స్టేట్​కు దక్కాలని సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత లోయర్ ​రైపేరియన్ ​స్టేట్ ఏపీనే కాబట్టి తమకే ఆ నీళ్లు దక్కుతాయి.వాటిపై ఎవరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఆ నీళ్లలో వాటాపైనా తేల్చాల్సింది కూడా ట్రిబ్యునలే.

- శశిభూషణ్​కుమార్, ఏపీ ఇరిగేషన్​ ప్రిన్సిపల్ ​సెక్రటరీ