
- అడ్డంకులపై దృష్టిపెట్టి పరిష్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ఇందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి తీవ్ర కృషి
- 35 వేల ఎకరాల చివరి భూములకు సాగునీరు
- ఆనందంలో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు
నాగర్కర్నూల్, వెలుగు : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందిస్తామనే హామీ రెండు దశాబ్దాల తర్వాత నెరవేరింది. దీంతో రంగారెడ్డి జిల్లా మాడ్గుల, ఆమనగల్, నాగర్ కర్నూల్జిల్లా పరిధిలోని వెల్డండ మండలాల్లో 35 వేల ఎకరాలకు సాగునీరు వస్తుండగా రైతులు ఆనందంలో ముగినిపోయారు.
భూ సేకరణ, రైతులకు పరిహారం, అటవీ ప్రాంతం, టేకు చెట్ల సమస్యల పరిష్కారానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పట్టువిడువకుండా పోరాడారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల, దొడ్లపాడు వరకు 29 కి.మీల కాల్వ నిర్మాణం, అక్విడెక్ట్, డ్రాప్స్ర్టక్చర్ల నిర్మాణాలను ఇరిగేషన్ ఆఫీసర్లు స్పీడ్ గా పూర్తి చేయడంతో చివరి భూములకు కృష్ణా జలాలు చేరాయి.
నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసి..
2005లో కేఐఎల్ 29వ ప్యాకేజీలో భాగంగా కల్వకుర్తి సెగ్మెంట్ పరిధి మాడ్గుల మండలంలోని చివరి భూములకు సాగు నీరు అందించేందుకు అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాల్వకు నాగర్కర్నూల్సెగ్మెంట్ లోని సిర్సవాడ వద్ద డిండి వాగు అడ్డంకిగా ఉండడంతో 2016లో పనులు నిలిచిపోయాయి.
అక్విడెక్ట్నిర్మాణం పూర్తి చేసేందుకు అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్రంగా కృషి చేయడంతో కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి వరకు మెయిన్ కెనాల్ నిర్మాణం 2018లో కంప్లీట్ కాగా.. మిడ్జిల్, ఊర్కొండ, కల్వకుర్తి మండలాలకు సాగునీరు అందింది.
జంగారెడ్డిపల్లి వరకు వచ్చిన కేఎల్ఐ మెయిన్కెనాల్ నిర్మాణాన్ని మాడ్గుల మండలం నాగిళ్ల వరకు పొడిగించే విషయాన్ని గత సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. 2018లో మాడ్గుల మండలం వరకు 59 కి.మీల కాల్వ నిర్మాణానికి అవసరమైన 500 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ఇచ్చినా పరిహారం చెల్లింపు, కాల్వ నిర్మాణ పనులకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేసింది.
కల్వకుర్తి మండలం జంగారెడ్డి పల్లి నుంచి వెల్డండ మండలం మీదుగా ఆమనగల్లు,మాడ్గుల మండలం నాగిళ్ల వరకు 59 కి.మీల మెయిన్ కెనాల్ నిర్మాణ పనులకు ఎన్నో అడ్డంకులు ఎదురైనా గత సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. వెల్డండ మండలంలో కాల్వకు అడ్డంగా అటవీ భూములు, రైతుల పొలాల్లో టేకు చెట్ల ఉండడంతో పనులు నిలిచిపోయాయి. రూ.5లక్షల పరిహారం చెల్లించడా నికి ఐదేండ్లు నిర్లక్ష్యం చేసింది.
దీంతో రూ.180 కోట్లతో నిర్మాణం కావాల్సిన కాల్వల వ్యయం రూ.360 కోట్లకు పెరిగింది. 29వ ప్యాకేజీలో గుడిపల్లి గట్టు రిజర్వాయర్నుంచి 160 కి.మీల దూరంలోని కల్వకుర్తి సెగ్మెంట్ మాడ్గుల మండలానికి సాగునీరు ఇచ్చేలా డీపీఆర్ రూపొందించి టెండర్లు ఫైనల్చేసింది. కానీ వివిధ కారణాలతో కాల్వ పనులను పొడిగించేందుకు దృష్టిపెట్టలేదు. మూడు మండలాల రైతులు ఏడేండ్లు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెల్డండ మండలం బర్కత్పల్లి వరకు నిర్మించిన మెయిన్కెనాల్కు అడ్డంకిగా మారిన ఫారెస్ట్ భూములతో పాటు ప్రైవేటుభూముల్లోని టేకు చెట్లకు, నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లింపుపై దృష్టి సారించింది. ఇందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో 350 ఎకరాలు, నాగర్కర్నూల్జిల్లా పరిధిలో150 ఎకరాలకు పరిహారం కింద రైతులకు రూ. 37 కోట్లు చెల్లించడంతో కాల్వ నిర్మాణానికి లైన్క్లియర్అయింది. మాడ్గుల మండలం నాగిళ్ల వరకు మెయిన్కెనాల్పనులు కంప్లీట్ అయ్యాయి.
వెల్డండ మండలంలో 20 వేలు, ఆమనగల్లు మండలంలో 2 వేలు, మాడ్గుల మండలంలో 12 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. మెయిన్ కెనాల్నిర్మాణం పూర్తి కాగానే డిస్ట్రిబ్యూటరీలు, సబ్స్, మైనర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కల్వకుర్తి డివిజన్ఈఈ శ్రీకాంత్ తెలిపారు. ఇందుకు100 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ తుది దశలో ఉందని పేర్కొన్నారు.
రెండు రోజుల కింద నాగిళ్ల వరకు చేరిన కృష్ణా జలాలకు ఇరిగేషన్ఆఫీసర్లు పూజలు చేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాలతో త్వరలో అధికారిక ప్రోగ్రామ్ నిర్వహిస్తామని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఎదురు చూసిన కేఎల్ఐ కాల్వలోకి నీరు వస్తుండడంతో చూసేందుకు రైతులు ఆయా గ్రామాల ప్రజలు ఉత్సాహంగా వస్తున్నారు.