కేఆర్‌‌ఎంబీ సమావేశం.. మళ్లీ హాజరుకాని తెలంగాణ

కేఆర్‌‌ఎంబీ సమావేశం.. మళ్లీ హాజరుకాని తెలంగాణ
  • బచావత్‌‌ కేటాయింపుల ప్రకారమే ప్రాజెక్టుల నిర్వహణ
  • కేఆర్‌‌ఎంబీ ఆర్‌‌ఎంసీ మీటింగ్‌‌లో చర్చ
  • సమావేశానికి మళ్లీ హాజరుకాని తెలంగాణ 

హైదరాబాద్‌‌ : రూల్స్​కు లోబడే శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టుల్లో కరెంట్‌‌ ఉత్పత్తి చేయాలని కేఆర్‌‌ఎంబీ రిజర్వాయర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. రూల్స్ మేరకే పవర్‌‌ జనరేషన్‌‌ చేయాలని సూచించారు. కృష్ణా బోర్డు ఆర్‌‌ఎంసీ రెండో మీటింగ్‌‌ సోమవారం జలసౌధలోని గోదావరి బోర్డు చైర్మన్‌‌ చాంబర్‌‌లో కన్వీనర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై అధ్యక్షతన నిర్వహించారు. ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ (పవర్‌‌) మౌన్‌‌తంగ్‌‌, ఏపీ ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. మీటింగ్‌‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ఆపరేషన్‌‌ అండ్‌‌ మెయింటనెన్స్‌‌ (రూల్‌‌ కర్వ్స్‌‌)పై సీడబ్ల్యూసీ డైరెక్టర్‌‌ రిషి శ్రీవాస్తవ ప్రజంటేషన్‌‌ ఇచ్చారు. బచవాత్‌‌ ట్రిబ్యునల్‌‌ (కేడబ్ల్యూడీటీ -1) ప్రకారమే ప్రాజెక్టుల నిర్వహణ ఉంటుందన్నారు. ఏపీ ఈఎన్సీ జోక్యం చేసుకొని కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఇచ్చే నీళ్లు ఖరీఫ్‌‌ సీజన్‌‌లో ఎక్కువగా, రబీలో తక్కువగా చూపించారని, చెన్నై తాగునీటికి రెండు విడతలుగా నీళ్లు ఇవ్వాల్సి ఉండగా ఒకేసారి 15 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని సూచించారని, హైదరాబాద్‌‌ తాగునీటికి ఉమ్మడి ఏపీలో చేసిన కేటాయింపులకు మించి నీటిని అలకేట్‌‌ చేశారనే అంశాలు దృష్టికి తీసుకొచ్చారు. ఆయా అంశాలు మరోసారి పరిశీలిస్తామని శ్రీవాస్తవ తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌లో కరెంట్‌‌ ఉత్పత్తికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపైనా చర్చించారు. ప్రజలకు తాగు, సాగునీటిని ఇవ్వడానికే ప్రాధాన్యత ఇవ్వాలని, కరెంట్‌‌ ఉత్పత్తి అనేది జాతి ప్రయోజనాలు, జాతీయ సమగ్రతకు లోబడి ఉండాలని ఏపీ ఈఎన్సీ కోరారు. సమావేశానికి తెలంగాణ హాజరుకానందున జూన్‌‌ మొదటివారంలో మరోసారి సమావేశమై దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. 



బచావత్‌‌ అవార్డు ప్రకారమే ప్రాజెక్టుల ఆపరేషన్‌‌ : ఏపీ ఈఎన్సీ
బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ అవార్డుకు లోబడే ప్రాజెక్టుల ఆపరేషన్‌‌ అండ్‌‌ మెయింటనెన్స్‌‌ ఉండాలని తాము కోరామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. మీటింగ్‌‌ తర్వాత జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలు మాత్రమే బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ కేటాయించింది కదా అనే మీడియా ప్రశ్నకు ఆయన స్పందిస్తూ అవార్డులో ఎట్లుంటే అంతే మొత్తం నీటినే ఇవ్వాలని తాము కోరామన్నారు. ట్రిబ్యునల్‌‌ కేటాయింపులకు అదనంగా ఇవ్వాలని తాము కోరలేదన్నారు. కృష్ణా బోర్డు మీటింగ్‌‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆర్‌‌ఎంసీ ఏర్పడిందనిన్నారు. 

 

కృష్ణా నీళ్లల్లో 50% వాటా కోసం పట్టుబడదాం: తెలంగాణ
కృష్ణా నీళ్లల్లో 50% వాటా కోసం పట్టుబట్టాలని ఇరిగేషన్‌‌ హైలెవల్‌‌ మీటింగ్‌‌లో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జలసౌధలో స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌, మాజీ అడ్వొకేట్‌‌ జనరల్‌‌ రామకృష్ణారెడ్డి, ఈఎన్సీలతో సమావేశమయ్యారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కృష్ణాలో న్యాయమైన వాటా దక్కలేదని, కేంద్రం కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటులోనూ జాప్యం చేస్తోందని, ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా కోరుతూ కేంద్ర జల శక్తి శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. పోలవరం ఎత్తు పెంపు, ఆ ప్రాజెక్టు ఆధారంగా చేపట్టబోయే లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీంలపైనా కేంద్రానికి లేఖ రాయాలనే అభిప్రాయానికి వచ్చారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ రూల్‌‌ కర్వ్స్‌‌ డ్రాఫ్ట్‌‌పై చర్చించి, అది అమల్లోకి వస్తే రాష్ట్రంపై పడే ప్రభావంపైనా చర్చించారు. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న ఇతర జలవివాదాలపైనా చర్చించారు.  

మరిన్ని వార్తల కోసం : -
పల్లెప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచుల డిమాండ్


కృష్ణా ఆర్ఎంసీ మీటింగ్కు తెలంగాణ గైర్హాజరు