కోటా అయిపోయినా ఏపీకి ఇంకా నీళ్లు.. 4 టీఎంసీలు కేటాయించిన కృష్ణా బోర్డు

కోటా అయిపోయినా ఏపీకి ఇంకా నీళ్లు.. 4 టీఎంసీలు కేటాయించిన కృష్ణా బోర్డు
  • తాగునీటి అవసరాల పేరిట మళ్లీ అలకేషన్​
  • సాగర్ కుడి కాల్వ నుంచి 5,500 క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు అవకాశం
  • తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయింపు
  • శ్రీశైలం నుంచి తీసుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడి, కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్లిన ఏపీకి.. కృష్ణా రివర్​మేనేజ్‌‌మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) మరిన్ని నీళ్లను కేటాయించింది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్​ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే 716 టీఎంసీలను తోడేసుకున్న ఏపీకి.. తాజాగా మరో 4 టీఎంసీలు ఇచ్చింది. సాగర్ ​కుడి కాల్వ నుంచి 5,500 క్యూసెక్కుల చొప్పున నీటిని తీసుకెళ్లేందుకు ఏపీకి అవకాశం కల్పించింది. అయితే తెలంగాణ మాత్రం కోటాను కూడా పూర్తిగా వాడుకోలేదు. ఇప్పటివరకు మన రాష్ట్రం వాడుకున్న నీళ్లు కేవలం 275.9 టీఎంసీలే కాగా.. తాజాగా 10.26 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఈ మేరకు గురువారం కేఆర్ఎంబీ వాటర్ రిలీజ్​ఆర్డర్​జారీ చేసింది. 

తాగునీటి అవసరాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ పెట్టిన డిమాండ్లకు తగ్గట్టు ఈ నెల 5న కేఆర్ఎంబీ త్రీ మెంబర్​కమిటీ మీటింగ్ ​నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ హాజరైనా.. ఏపీ మాత్రం కుంటిసాకులు చెప్పి ఎగ్గొట్టింది. ఆ తర్వాత వాటర్​ఇండెంట్​రిక్వెస్ట్‎కు బోర్డు అవకాశం ఇచ్చింది. దీంతో 10.26 టీఎంసీలు కావాలని తెలంగాణ.. 10 టీఎంసీలు అవసరమని ఏపీ ఇండెంట్​ఇచ్చాయి. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బోర్డు.. తెలంగాణ డిమాండ్​మేరకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4 టీఎంసీలను కేటాయించింది. 

సాగర్‌‌‌‌లో 505 అడుగుల నుంచి నీళ్లు

ఈ నెల 5 నాటికి శ్రీశైలం మినిమం డ్రా డౌన్​లెవెల్​800 అడుగులు, నాగార్జునసాగర్​ మినిమం డ్రా డౌన్​లెవెల్​510 అడుగుల వద్ద కేవలం 10.81 టీఎంసీల నీళ్లే అందుబాటులో ఉన్నాయని కృష్ణా బోర్డు వాటర్​రిలీజ్​ఆర్డర్‏లో పేర్కొంది. ఆ నీళ్లతో ఇరు రాష్ట్రాలకూ నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదు. 

ఈ నేపథ్యంలోనే శ్రీశైలంలో 800 అడుగుల వద్ద నుంచే నీటిని తీసుకోవాలనుకున్నా.. సాగర్​ నుంచి మాత్రం 505 అడుగుల వద్ద నుంచి కూడా నీటిని తీసుకునేందుకు బోర్డు అనుమతిచ్చింది. ఆ లెక్క ప్రకారం శ్రీశైలంలో 8.422 టీఎంసీలు, సాగర్​లో 12.793 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. 

మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో కలిపి 21.215 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. నీటిని తరలించేటప్పుడు ఆవిరి కింద 4.243 టీఎంసీలు పోతాయని బోర్డు పేర్కొంది. ఇక మిగిలిన 16.972 టీఎంసీల నీటి నుంచే రెండు రాష్ట్రాలకు బోర్డు నీటిని పంచింది. ఆ 16.972 టీఎంసీల్లో తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4 టీఎంసీలు ఇవ్వగా.. భవిష్యత్​ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిగతా నీటిని క్యుషన్​కింద పెట్టింది. ఆ మిగిలిన నీటిని ప్రాజెక్టులకు వరద వచ్చేంత వరకు ఆదా చేసి పెట్టుకోవాలని సూచించింది.

కుడి కాల్వ నుంచి  5,500 క్యూసెక్కులు..

ఏపీ మరోసారి నాగార్జునసాగర్​కుడి కాల్వ నుంచి నీటిని తీసుకెళ్లేందుకు కృష్ణా బోర్డు అనుమతిచ్చింది. ఏపీ 4 టీఎంసీల వరకు నిరంతరాయంగా 5,500 క్యూసెక్కుల చొప్పున నీటిని కాల్వ ద్వారా తీసుకుపోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఏపీ 4 టీఎంసీలతోనే ఆపుతుందా అనే అనుమానాలు కలుగుతు న్నాయి. 

గత ఫిబ్రవరిలో కుడి కాల్వ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటినే తీసుకుపోవాలని బోర్డు చెప్పినా.. 8 వేల క్యూసెక్కుల వరకు నీటిని ఏపీ తరలించు కుపోయింది. ఇప్పుడైనా బోర్డు చెప్పిన మాటకు ఏపీ కట్టుబడి ఉంటుందా అన్నది అనుమానంగానే మారింది. అందుకు తగ్గట్టు ఏపీని కట్టడి చేయాల్సిన అవసరమూ ఉన్నది. 

మరోవైపు రెండు ప్రాజెక్టుల్లోనూ నీటి కొరత ఉన్నందున నీటిని కొంచెం పొదుపుగా వాడుకోవాలని బోర్డు సూచించింది. పవర్​హౌస్‌‌ల ద్వారా నీటిని విడుదల చేసుకోవాలని, తద్వారా విద్యుదుత్పత్తిని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. శ్రీశైలం నుంచి తెలంగాణ నీటి అవసరాలు తీర్చుకోవాలని బోర్డు పేర్కొంది. జులై 31 వరకు 800 అడుగుల మట్టాన్ని మెయింటెయిన్​చేయాలని సూచించింది.