ఫిలిప్పీన్స్లో తుఫాను బీభత్సం.. 26 మంది మృతి

ఫిలిప్పీన్స్లో తుఫాను బీభత్సం.. 26 మంది మృతి

మనీలా: ఫిలిప్పీన్స్​లో ‘కల్మేగి’ తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను ప్రభావంతో సెంట్రల్  ప్రావిన్సుల్లో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చాయి. వరదల వల్ల పలుచోట్ల 26 మంది చనిపోయారు. చాలాచోట్ల ఇండ్లు, వాహనాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. జనం ఇండ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో రోజంతా అంధకారం నెలకొంది. 

కాగా.. సదరన్  అగూసన్ డెల్ సుర్  ప్రావిన్స్​లో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఐదుగురితో వెళ్లిన ఫిలిప్పీన్స్  ఎయిర్ ఫోర్స్  హెలికాప్టర్  కూలిపోయింది. అందులో ఉన్న వారి ఆచూకీ ఇంకా తెలియలేదని మిలిటరీ అధికారులు తెలిపారు. లొరేటో పట్టణంలో ఆ హెలికాప్టర్  ప్రమాదానికి గురైందని, అందులోని సిబ్బందిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.