- మెదక్ జిల్లాలో రేషన్ షాప్ లు, మధ్యాహ్న భోజనం తనిఖీ
- నాణ్యమైన భోజనం పెట్టని వంట నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం
మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట, వెలుగు: ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన ఉచిత రేషన్ బియ్యం అందాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కమిషన్ సభ్యులు ఆనంద్, భారతి, శారదతో కలిసి మెదక్ జిల్లాలో పర్యటించారు. నర్సాపూర్ టౌన్ లో రేషన్ షాప్ , రెడ్డిపల్లిలో అంగన్‌వాడీ సెంటర్, సూల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెడ్డిపల్లి హై స్కూల్ లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ కోరాలని డీఈవోను ఆదేశించారు.
ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద, రేషన్ డీలర్లకు న్యాయం జరిగేలా బియ్యం బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా కచ్చితమైన బరువు ఆధారంగా పంపిణీ చేయాలని సూచించారు. ప్రతి రేషన్ షాప్ లో నిల్వ, పంపిణీ నమోదు పద్ధతులు, కార్డుదారుల కు సరిగా సరుకు లు అందిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. డీలర్ల ప్రవర్తన, పంపిణీ తీరు చూశారు. అంగన్ వాడీ సెంటర్లలో పిల్లలకు పోషకాహారం, అభివృద్ధి సేవలు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు.
.కౌడిపల్లి మండలంలో ఆశ్రమ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, విద్యా వసతులు, పిల్లల హాజరు, స్కూల్ నిర్వహణను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. రేషన్ షాప్, అంగన్ వాడీ, స్కూల్స్ లో ఫిర్యాదుల పెట్టె ఉండాలని తెలిపారు. ఫుడ్ కమిషన్ కమిషన్ వెంట ఈఓ రాధాకిషన్, డీ డబ్ల్యుఓ హేమ భార్గవి, సివిల్ సప్లై అధికారి నిత్యానంద, నర్సాపూర్ ఆర్టీఓ మహిపాల్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాసరావు ఉన్నారు.
