- టోలిచౌకీలో ప్రచారం..
- పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇందుకోసం వచ్చే నాలుగు రోజులపాటు కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా మంగళవారం (నవంబర్ 04) టోలిచౌకి బృందావన్ కాలనీలో మంత్రి ప్రచారం నిర్వహించారు.
పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ఏం చేయాలన్నదానిపై స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పట్ల వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. కొందరు స్థానికులు తమ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తాను ఇంచార్జ్ మంత్రిగా ఉన్నానని, రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించానని చెప్పారు. ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేయలేకపోయామన్నారు. ఉప ఎన్నిక అనంతరం తిరిగి పనులు ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు.
మంత్రి వివేక్ చొరవతో అభివృద్ధి: నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రూ.150 కోట్ల నిధులను కేటాయించి పనులు చేపట్టామని నవీన్ యాదవ్ చెప్పారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, అయితే మంత్రుల చొరవతో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు పూర్తి అవుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, తప్పనిసరిగా ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
