- చత్తీస్గఢ్లోని బిలాస్ పూర్లో ప్రమాదం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్ ట్రైన్..
- నుజ్జునుజ్జయిన ప్యాసింజర్ రైలు ముందు బోగీలు
- 14 మందికి తీవ్రగాయాలు.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొనడంతో 8 మంది మృతిచెందారు. 14 మందిగాయపడ్డారు. బిలాస్‌పూర్ జిల్లా బిలాస్పూర్కాట్నీ సెక్షన్‌లోని లాల్‌ఖాదన్ ఏరియాలో మంగళవారం (నవంబర్ 04) మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జైరామ్ నగర్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ ట్రైన్ ఇంజిన్, ముందు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.
బోగీల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌తో కూడిన రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ రజనీశ్ సింగ్ పేర్కొన్నారు. ఓ శిశువును కాపాడినట్టు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని, తీవ్రంగా గాయపడ్డవారికి రైలు బోగీలోనే చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
నిలిచిపోయిన రైళ్లు..
గూడ్స్ రైలు ఇంజన్‌పైకి ప్యాసింజర్ రైలు ముందు బోగీలు ఎక్కినట్టు వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బిలాస్‌పుర్–-హావ్‌డా లైన్ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారిమళ్లించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సాంకేతిక బృందాలు ట్రాక్‌లను, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాయి. కాగా, ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
