తాండవ్, కౌన్ బనేగి శిఖర్వతి, హుష్ హుష్, బొంబాయి మేరీ జాన్ లాంటి వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంది కృతిక కమ్రా. ఆమె ఫిమేల్ లీడ్‌గా నటించిన తాజా వెబ్ సిరీస్ ‘గ్యారహ్ గ్యారహ్’. ప్రస్తుతం ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ గురించి తెలుగు మీడియాతో మాట్లాడిన కృతిక పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘పోలీస్ కాన్సెప్ట్‌తో చాలా సిరీస్‌లు వచ్చినా వాటిలో ఇది చాలా ప్రత్యేకమైంది. బ ఎందుకంటే రెండు విభిన్న కాలాల మధ్య టెలికమ్యూనికేషన్ జరిగితే ఎలా ఉంటుందనేది దీని కాన్సెప్ట్.
ప్రతిరోజు రాత్రి 11.11కి.. రెండు వేర్వేరు దశాబ్దాల వాకీ టాకీలు కొన్ని నిమిషాల పాటు కనెక్ట్ అవుతాయి. టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ లాంటి అంశాలతో డెహ్రాడూన్, మసూరీ నేపథ్యంలో ఓ ఫిక్షనల్ వరల్డ్‌ను మనకు చూపిస్తుంది. నా పాత్ర రెండు కాలాల్లోనూ ఉంటుంది. నా పాత్ర పేరు వామికా రావత్. కొత్త పోలీసాఫీసర్‌గా గతంలో కనిపిస్తే, ఇప్పటికాలంలో డీఎస్పీగా కనిపిస్తా. ఫిజిక్ పరంగా ఒకేలా కనిపిస్తూనే, ప్రవర్తనలో మాత్రం మార్పు చూపించాలి.
పోలీస్ పాత్రలో నటించడం కొత్తగా అనిపించింది. ఖాకీ యూనిఫామ్‌లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అది మనల్ని మార్చేస్తుంది. అది వేసుకోగానే మన నడక, నడత మారిపోతుంది. యాక్షన్ సీన్స్ కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడాల్సి ఉంది. డూప్‌ను పెడతానన్నా నేనే వద్దన్నాను. ఇప్పుడు నా పాత్రకు కాంప్లిమెంట్స్ రావడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది.