
న్యూఢిల్లీ: మాగ్నెట్ వైండింగ్ వైర్స్ తయారీ కంపెనీ కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ ఐపీఓ ద్వారా రూ.745 కోట్లు సేకరించడానికి రెడీ అయ్యింది. ఇందుకోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దగ్గర ప్రిలిమినరీ పేపర్స్ ఫైల్ చేసింది. ఐపీఓలో రూ.420 కోట్ల ఫ్రెష్ షేర్ల ఇష్యూ, రూ.325 కోట్ల విలువైన ప్రమోటర్స్ షేర్ల ఆఫర్- ఫర్-సేల్ (ఓఎఫ్‌ఎస్) కలిసి ఉంటాయి.
ఫ్రెష్ ఇష్యూ నుంచి వచ్చే డబ్బులో రూ.225.98 కోట్లను అప్పు తీర్చడానికి, రూ.90.06 కోట్లను సూపా ఫెసిలిటీని విస్తరించడానికి, పూణేలోని చకన్‌లో కొత్త మెషినరీ కొనుగోలుకు వాడతామని కంపెనీ చెబుతోంది. సూపా ఫెసిలిటీలో రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి మరో రూ.10.41 కోట్లను ఖర్చు చేస్తామని ప్రకటించింది.
నికితా పేపర్స్ ఐపీఓ ధర రూ.95–104
క్రాఫ్ట్ పేపర్ తయారీ కంపెనీ నికితా పేపర్స్ తన రూ.67.5 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం షేర్ ధరను రూ.95-–104గా శనివారం నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ మే 27న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది, మే 29న క్లోజ్ అవుతుంది. కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫాం ఎమర్జ్‌లో లిస్ట్ అవుతాయని కంపెనీ ఒక స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 ఈక్విటీ షేర్ల కోసం బిడ్ వేయొచ్చు.
ధర అప్పర్ బ్యాండ్ వద్ద కంపెనీ సుమారు రూ.67.54 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ పూర్తిగా 64.94 లక్షల ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌ను పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, జనరల్ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తారు. 2023–24 లో కంపెనీ రూ.338.60 కోట్ల రెవెన్యూ, రూ.16.60 కోట్ల నికర లాభాన్ని సాధించింది.