కంటోన్మెంట్ డెవలప్​మెంట్​కు కేంద్రం సహకరిస్తలే

కంటోన్మెంట్ డెవలప్​మెంట్​కు కేంద్రం సహకరిస్తలే

సికింద్రాబాద్/హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ ​కంటోన్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా కేంద్రం అందుకు సహకరించడం లేదని మంత్రి కేటీఆర్​అన్నారు. కంటోన్మెంట్​పరిధిలో రోడ్లను మూసేయడంతో పాటు, ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటోందన్నారు. పేద ప్రజలకు ఇండ్లు కట్టించేందుకు స్థలం కేటాయించాలని కోరామని, అందుకు మరో చోట స్థలం ఇస్తామని చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. శనివారం సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్​లో రూ.61 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఎస్పీ రోడ్​లో ప్యాట్నీ నాలాపై రూ.10 కోట్లతో చేపట్టే వంతెన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. తర్వాత పాటిగడ్డ లో రూ.6 కోట్లతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు, ఎస్ఎన్​డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.45 కోట్లతో చేపట్టే బేగంపేట నాలా అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయనతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్, మల్లారెడ్డి, గ్రేటర్​మేయర్​గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్​ శ్రీలతరెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ ​నాయకులు ఉన్నారు. 

నిరసనలు..
కంటోన్మెంట్​పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్​కు బస్తీవాసులు, ఉద్యమకారుల నుంచి నిరసన సెగ తగిలింది. వివిధ సమస్యలపై ఆయనను నిలదీసే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాలా డెవలప్​మెంట్​పనులు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ  బేగంపేట మయూరీ మార్గ్​లోని అల్లంతోట బావి బస్తీ వాసులు వాపోయారు. 

రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై రివ్యూ..
అవసరమైన చోట రైల్వే బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. శనివారం బుద్ధభవన్ లో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైల్వే క్రాసింగ్ లపై చేపట్టాల్సిన నిర్మాణాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలో ఉన్న ప్రతి రైల్వే క్రాసింగ్, ఇరుకుగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ, జీహెచ్ఎంసీ కలిసి పనిచేయాలన్నారు. సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట రైల్వే అండర్ బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అనుమతులు రాగానే సనత్ నగర్– బాలానగర్  రైల్వే అండర్ పాస్ ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మిషన్ కాకతీయతో.. 10 ఫీట్లల్లనే నీళ్లు: కేసీఆర్

యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం