
- అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి ఇప్పటికి 23 వేల ఓట్లు పెరిగినయ్: కేటీఆర్
- కేంద్ర ఎన్నికల సంఘంపై నమ్మకం లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బిహార్‌లో జరుగుతున్నది ఓట్ చోరీ అయితే ఇక్కడ జరుగుతున్నది ‘చోరీ కా ఓట్’ అని కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 23 వేల ఓట్లు పెరిగాయన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ లిస్టుతోనే ఈ అక్రమాలు బయటపడ్డాయన్నారు. దీనిపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు. అయితే, అధికారులు మాత్రం లిస్టు నుంచి 12 వేల మందిని తొలగించామని చెప్పారని, అలాంటప్పుడు 23 వేల ఓట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు.
మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఓటర్ లిస్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో గెలిచేందుకు కాంగ్రెస్ ఓట్‌చోరీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. సంస్కృతి అపార్ట్మెంట్లో ఒకే ఇంటి నంబర్‌పై 43 ఓట్లు, బూత్ నంబర్ 125లో ఒకే ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయన్నారు. హౌస్ నంబర్ 118లోని కాంగ్రెస్ లీడర్ ఇంట్లో 32 ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయ్యాయన్నారు. సెప్టెంబర్ 2న ఒకేరోజు వేల ఓట్లను ఎలా యాడ్ చేశారని ఆయన ప్రశ్నించారు. ఒకే వ్యక్తి పేరుతో మూడు ఓట్లు, మూడు ఓటర్ కార్డులున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు.. ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లున్నాయన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాడ్ అయిన 23 వేల ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కవుతోందని, కేంద్ర ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం లేదని కేటీఆర్ ఆరోపించారు. దొంగ ఓట్ల వ్యవహారంపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. మాగంటి సునీత భావోద్వేగం చెందడాన్ని విమర్శించిన కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు. ఒక మహిళగా, కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ, ఆవేదన ఆమెకు ఉండదా? అని ప్రశ్నించారు.