గమ్యం తెలియని కాంగ్రెస్​ పడవ: కేటీఆర్

గమ్యం తెలియని కాంగ్రెస్​ పడవ: కేటీఆర్
  • ప్రజలు ఛీ కొట్టినా కాంగ్రెసోళ్లకు బుద్ధిరాలేదు
  • ఐదేండ్లుగా వాళ్లది పాడిందే పాట
  • డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టించే బాధ్యత మాపై ఉంది
  • ఏనుగు వెళ్తుంటే చాలా జంతువులు అరుస్తుంటాయి
  • జూబ్లీహిల్స్ కార్యకర్తలతో టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్
  • నక్సల్స్​ సమస్య పరిష్కారంలోనూ రాష్ట్రం ఆదర్శం: మహమూద్​ అలీ
  • ఎవడేం మాట్లాడినా పట్టించుకోవద్దు: తలసాని​

హైదరాబాద్, వెలుగురైతుల పొలాలు పచ్చగుంటే కాంగ్రెసోళ్ల కండ్లు ఎర్రబడుతున్నాయని, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధిరాలేదని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏం చెయ్యాల్నో తెల్వక ప్రాణహిత నదిలో నాటు పడవ ఎక్కి  నాటు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు విన్నంక పాడిందే పాడరా పాసుపండ్ల.. అన్న సామెత గుర్తుకువస్తున్నది” అని ఎద్దేవా చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్​ను టార్గెట్​ చేస్తూనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘రాష్ట్రంలో మంచిగా వర్షాలు పడుతున్నాయి.  ప్రాజెక్ట్ లు నిండుతున్నాయి. తాగునీటికి, సాగు నీటికి కొరత లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉంది. శరవేగంగా ప్రాజెక్ట్ లు పూర్తవుతున్న నేపథ్యంలో ఏదో విమర్శ చేయాలని.. తాము ఉన్నామనే ఉనికిని చాటుకోవటానికి కాంగ్రెసోళ్లు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఐదేండ్లుగా అరిగిపోయిన రికార్డు మాదిరిగా విమర్శలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.  ప్రజలు ఛీ కొట్టినా, ఎన్నికల్లో బుద్ధిచెప్పినా వాళ్లకు జ్ఞానం రాలేదన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ప్రాణహితలో కాంగ్రెస్ నాయకులు నాటు పడవలో వెళ్తున్నప్పటి ఫొటో ఒకటి తనకు మిత్రుడు పంపించాడని, అది చూస్తుంటే చిన్నప్పటి ఒక పాట గుర్తుకు వచ్చిందని కేటీఆర్​ చెప్పారు. “ఆ ఫొటో చూస్తుంటే.. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం.. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం.. అయ్యో తెలియదు పాపం.. పాట గుర్తుకువచ్చింది. అచ్చం ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి అట్లనే ఉంది” అని ఎద్దేవా చేశారు. ‘‘దేశంలో మీ పార్టీ గురించి తెలుసుకోండి. మీ జాతీయ నాయకుడు ఎవరో తెలియదు. తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేక నేతలంతా ఇతర పార్టీలకు వెళ్తున్నారు. కేసీఆర్ ను తిడితే చూపించే టీవీలు, రాసే పత్రికలు ఉన్నాయని నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడుతున్నారు” అని కేటీఆర్​ దుయ్యబట్టారు. ఏనుగు వెళ్తుంటే చాలా జంతువులు అరుస్తుంటాయని, వాటిని పట్టించుకోవాల్సి అవసరం లేదని టీఆర్​ఎస్​ కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్  కమిట్​మెంట్​ ఏందో ప్రజలకు తెలుసన్నారు.

నక్సల్​ సమస్య పరిష్కారంలోనూ ఆదర్శం

రాష్ట్రంలో ఇంటి పార్టీలాంటి టీఆర్ఎస్ ఉండగా ఇతర పార్టీల అవసరం లేదని హోంమంత్రి మహముద్ అలీ అన్నారు. రాష్ట్రంలోని ఎన్నో  పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. నక్సల్స్ సమస్యపై సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలో నక్సల్స్ ను ఏ విధంగా అరికట్టారో ఆ విధంగా ముందుకు వెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రంలోని అధికారులకు సూచించారని, ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఎవడేం మాట్లాడినా పట్టించుకోవద్దు: తలసాని

వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు పోటీయే లేదని, మనకు మనమే పోటీ అని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ‘‘గాలి మాటలు చాలా మాట్లాడుతారు. ఎవడేం మాట్లాడిన కొన్ని టీవీలు, పేపర్లు చూపిస్తున్నాయి. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఎప్పుడైనా హైదరాబాద్ లో ఇంత అభివృద్ధి చూశామా? కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఐటీ సంస్థలు, పరిశ్రమలను తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారు. మంత్రి అంటే ఇలా ఉండాలని ప్రజలు అనుకునేలా చేశారు” అని ఆయన
పేర్కొన్నారు.