రేవంత్.. రాజీనామా చెయ్.. మల్కాజ్‌‌గిరిలో తేల్చుకుందాం: కేటీఆర్

రేవంత్.. రాజీనామా చెయ్.. మల్కాజ్‌‌గిరిలో తేల్చుకుందాం: కేటీఆర్

రేవంత్‌‌ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి.. మల్కాజ్‌‌గిరి లోక్‌‌సభ స్థానానికి తనతో పోటీ పడాలని కేటీఆర్ సవాల్ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే పోస్టుకు తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. మొగోనివైతే లోక్‌‌సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెల్వాలని రేవంత్ విసిరిన సవాల్‌‌పై కేటీఆర్‌‌‌‌ మండిపడ్డారు. గెలిస్తే మొగోళ్లు, ఓడిపోతే ఆడోళ్లా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కొడంగల్‌‌లో ఓడిపోయినప్పుడు మొగోనివి కాదా? అంటూ రేవంత్‌‌ను దుయ్యబట్టారు. సీఎం వ్యాఖ్యలు మహిళలను కించపర్చేలా ఉన్నాయన్నారు. రేవంత్ మొగోడైతే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి, మహిళలకు రూ.2,500లు ఇవ్వాలని, హామీలన్నీ అమలు చేసి చూపించాలని కేటీఆర్ చాలెంజ్ చేశారు. 

గతంలో కొడంగల్‌‌, జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి సవాళ్లే చేసి పారిపోయాడని, ఆయన మాటలకు విలువలేదన్నారు. రాజకీయాల్లో తనది మేనేజ్‌‌మెంట్ కోటా అయితే, రేవంత్‌‌ది పేమెంట్ కోటా అని కేటీఆర్ విమర్శించారు. రాహుల్, ప్రియాంకా గాంధీలది ఏ కోటానో కూడా రేవంత్ చెప్పాలన్నారు. మాణిక్కం ఠాకూర్​కు డబ్బులిచ్చి రేవంత్​ పదవి తెచ్చుకున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం బిల్డర్లను, వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని అన్నారు. రేవంత్‌‌ సెస్‌‌పైన త్వరలోనే వారు రోడ్డెక్కుతారని పేర్కొన్నారు. రేవంత్‌‌కు ఇన్‌‌ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉందని, తానే సీఎం అని ఆయన పదే పదే చెప్పుకుంటున్నాడని అన్నారు. ఆయన సీఎం అంటే ఆయనకే నమ్మకం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.