తప్పుడు ప్రచారం: కేటీఆర్.. ముక్కు నేలకు రాస్తావా..? ..చెక్ డ్యామ్ కూలిందని నిరూపిస్తావా?

 తప్పుడు ప్రచారం: కేటీఆర్.. ముక్కు నేలకు రాస్తావా..? ..చెక్ డ్యామ్ కూలిందని నిరూపిస్తావా?
  • లేదంటే క్షమాపణ చెప్పాలి
  • దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​ ​రెడ్డి సవాల్​

మహబూబ్​నగర్, వెలుగు : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాల వద్ద చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందని బీఆర్ఎస్​ఎమ్మెల్యే కేటీఆర్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహబూబ్​నగర్​ డీసీసీ ప్రెసిడెంట్, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​రెడ్డి ఫైర్​అయ్యారు. 

“ కేటీఆర్.. దమ్ముంటే చెక్ డ్యామ్ కొట్టుకుపోయినట్లు నిరూపించాలి. లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి”అని  ఆయన సవాల్​చేశారు. మహబూబ్​నగర్​జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంపై కేటీఆర్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

రాచాల వద్ద చెక్ డ్యామ్ తెగిపోలేదని, మునుగాల్​చెడ్ చెరువు నింపడానికి నిర్మించిన గైడ్ వాల్​మాత్రమే తెగిపోయిందని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్​లో కూర్చొని ట్విట్టర్​లో పోస్టులు పెట్టడం ఏంటని కేటీఆర్​ను ఆయన ప్రశ్నించారు. ఇరిగేషన్ ఈఈ చెక్ డ్యాంను పరిశీలించి ఎలాంటి ముప్పు లేదని రిపోర్ట్​ఇచ్చారన్నారు. 

అధికారులు ఇచ్చిన రిపోర్టును పక్కనపెట్టి, చెక్ డ్యామ్ కూలినట్టు కేటీఆర్​ట్విట్టర్ లో తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. గైడ్​వాల్​కొట్టుకుపోయి పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముడా చైర్మన్​లక్ష్మణ్​యాదవ్​ నేతలు ఉన్నారు.