- నేను బినామీనైతే.. మీరు గ్లోబరీనాకే ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన్రో చెప్పాలి
- ఇప్పటికే డిఫమేషన్ నోటీసులు పంపించా
- కవిత నోటి నుంచి వచ్చేవి కాంగ్రెస్ పలుకులే
- వచ్చే ఏడాది రెండు విడతల్లో పాదయాత్ర
- బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తుండదు
- మీడియాతో కేటీఆర్ చిట్‍చాట్
వరంగల్/హైదరాబాద్, వెలుగు: గ్లోబరీనా సంస్థలో తనకు వాటాలుగానీ, ఆర్థిక లావాదేవీలుగానీ ఏమీ లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారని, 48 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సీఎంకు దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్షలకు రావాలని సవాల్ విసిరారు. గ్లోబరీనాకు కేటీఆర్ బినామీ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గురువారం వరంగల్‌లో కేటీఆర్ స్పందించారు. ‘గ్లోబరీనా నా బినామీ సంస్థ అంటూ సీఎం రేవంత్‍రెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేయాలే. దీనిపై ఇప్పటికే డిఫమేషన్నోటీసులు పంపిన. గడువులోగా క్షమాపణలు చెప్పకుంటే సివిల్, క్రిమినల్చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తా. ఇద్దరం లైడిటెక్టర్పరీక్షలకు వెళ్దాం’ అంటూ బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
గురువారం గ్రేటర్ వరంగల్‌లో పర్యటించిన కేటీఆర్హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి గార్డెన్‍లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్‍చాట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోనూ ఓ ప్రకటన విడుదల చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, తాను గ్లోబరీనాకు బినామీనే అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు అదే సంస్థతో ఒప్పందం చేసుకుందని నిలదీశారు. ‘కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే నీట్‌లో అక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల ని డిమాండ్ చేస్తున్నారు. మేము కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే.. సీఎం రేవంత్ మాత్రం ప్రధాని పేరెత్తడానికే వణికిపోతున్నడు. పాత కేసులు తోడుతరని భయపడుతున్నడు’’ అని పేర్కొన్నారు.
రేవంత్ పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీలో..
సీఎం రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ పార్టీలో.. రాత్రి బీజేపీలో ఉంటున్నాడని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆయన కాంగ్రెస్ వాళ్లతో కాకుండా బీజేపీ ఎంపీల కార్లలో తిరుగుతాడన్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఒక్క మూట పంపితే.. బీజేపీ పెద్దలకు రెండు మూటలు పంపిస్తున్నాడని ఆరోపించారు. తన పాత కేసులు ఎక్కడ బయటకు తీస్తారోనని ప్రధాని మోదీకి సీఎం భయపడ్తున్నాడన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి సరైన లీడరే లేడు
బీజేపీ తెలంగాణలో పవర్‍లోకి రావడానికి స్ట్రాంగ్ అవుతోందనే ప్రచారం ఉత్తమాటే అని కేటీఆర్ అన్నా రు. రాష్ట్రంలో వారికి చెప్పుకోదగ్గ నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తమను ఓడించిన స్టూడెంట్లు ఇప్పుడు ఢిల్లీలో బీజేపీని వణికిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ఫస్ట్‌టైమ్ షేక్ అవుతున్నాడని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‍ఎస్ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
హరీశ్‌రావుకు 25 ఏండ్లుగా శీలపరీక్ష తప్పట్లే
దళితబంధు అద్భుతమైన పథకమని.. కానీ, ఆ పథకం రానివాళ్లలో వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అందరికి అందుబాటులో ఉన్నా కూడా ‘సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేగా మాకే అందుబాటులో ఉండట్లేదు’ అని కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 12చోట్ల అభ్యర్థులను మారిస్తే అందులో 10 మంది విజయం సాధించారని.. పలు స్థానాల్లో అభ్యర్థులను మారిస్తే ఫలితం వేరేలా ఉండేదన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో తాము కేసీఆర్‍ను పూర్తిస్థాయిలో కన్విన్స్చేయడంలో ఫెయిలైనట్లు చెప్పారు. హరీశ్‌రావు పార్టీ మారుతాడనే ప్రచారం ఉట్టిదేనని..ఈ అంశంలో 25 ఏండ్లుగా అతనికి శీలపరీక్ష తప్పట్లేదన్నారు. హీరోయిన్లతో ఎఫైర్‍ఉందని.. వారి ఫోన్లను ట్యాప్ చేశాడంటూ తనపై ఇష్టం వచ్చినట్లు సోషల్‍మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. తనకు సీఎం కావాలనే ఆలోచనే లేదన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‍ను తిరిగి సీఎం చేయడమే తమ ఎజెండా అని కేటీఆర్ అన్నారు.
