ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌లోకి అదానీ గ్రూప్?నిబంధనల సడలింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌లోకి అదానీ గ్రూప్?నిబంధనల సడలింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
  •     సొంత విమానయాన సంస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు 
  •     నిబంధనలు సడలించాలని కేంద్రానికి ప్రతిపాదన

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే దేశంలో ఎనిమిది ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులను నిర్వహిస్తున్న ఈ గ్రూప్.. ఇప్పుడు సొంత ఎయిర్‌‌‌‌లైన్స్ ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులు నిర్వహించే సంస్థలు.. ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌లో 10 శాతానికి మించి వాటా కలిగి ఉండేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా ఉన్న నిబంధనలను సడలించాలని అదానీ గ్రూప్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతిస్తే సొంత ఎయిర్‌‌‌‌లైన్స్ ప్రారంభించడం లేదా ఇప్పటికే ఉన్న ఏదైనా విమానయాన సంస్థలో వాటా కొనుగోలు చేయడం వంటి మార్గాలను పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. 


దేశీయ విమానయాన రంగంలో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థల ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఇండిగో 65.4 శాతం దేశీయ మార్కెట్ వాటాతో మొదటిస్థానంలో, 25 శాతం వాటాతో ఎయిర్ ఇండియా రెండోస్థానంలో ఉంది. అయితే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులను నిర్వహించే సంస్థలు ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ను కూడా నడిపితే ప్రయోజనాల ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని ప్రత్యర్థి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు దేశంలో విమాన ప్రయాణాల రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల సంఖ్యను భారీగా పెంచాలని
 ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి దేశవ్యాప్తంగా ఎయిర్​పోర్టుల సంఖ్యను 400 వరకు పెంచాలని 
భావిస్తున్నది.