హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్అంటూ అవమానించడం సీఎం రేవంత్‌రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ యువత సామర్థ్యాన్ని కించపరిచేలా మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి ఏముందని గురువారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘రేవంత్ ఒక్కసారైనా ఒక పోటీ పరీక్ష రాశారా? ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకు హాజరయ్యారా? ఏదైనా వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం ఉందా?’’ అని అడిగారు.
రేవంత్ రెడ్డి గతాన్ని ప్రజలు మరచిపోలేదని, రియల్ఎస్టేట్ బ్రోకర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం బ్లాక్‌మెయిల్ రాజకీయాల వరకు వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివాలా తీసిన కాంగ్రెస్‌పార్టీలో సీఎం పదవిని కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, దేశానికి సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను అందిస్తున్న తెలంగాణ యువతను అవమానించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ యువత కృషి, ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుండగా, వారిని అవమానించే వ్యాఖ్యలను సీఎం వెంటనే ఉపసంహరించుకుని రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
