- పోటీల్లో మేము పాల్గొనం: కేటీఆర్
- సమస్యలు చర్చించేందుకు సభను ఇంకో 10 రోజులు కొనసాగించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించే క్రీడా పోటీల్లో తాము పాల్గొనబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అనేక సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని సమయం వృథా చేయడం సరికాదన్నారు. అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి, అర్థాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడాన్ని ప్రజలు సమర్థించరని, ఇది మంచి పరిణామం కాదన్నారు. “మేము ఆటలాడి ఒలింపిక్స్‌కి వెళ్లేది లేదు.
క్రీడలను ప్రోత్సహించాలంటే పిల్లలకు అవకాశాలు కల్పించి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆటలు ఆడించడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరైనా క్రీడల్లో పాల్గొనాలనుకుంటే ముందుగా ప్రజా సమస్యలపై చర్చలు పూర్తిచేసి, శాసనసభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత రెండు రోజులపాటు క్రీడలు నిర్వహించుకోవచ్చని సూచించారు.
విమెన్స్ డాక్టర్స్ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించిన విమెన్స్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్-4 కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు సాయి కుమార్, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, మహిళా వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన కేటీఆర్.. విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ లీగ్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఉపయోగపడేలా వినియోగించడం అభినందనీయమని కేటీఆర్కొనియాడారు.
