
- ప్రమాదాన్ని ఎందుకు దాచారు?.. సీఎం ఎందుకు రివ్యూ చేయలే
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- మేడిగడ్డ కుంగితే మేం వెంటనే బయటపెట్టినం
- సుంకిశాలను ప్రాజెక్టును పరిశీలించి.. ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని ప్రకటన
హైదరాబాద్, వెలుగు:సుంకిశాల ప్రాజెక్టు పనులు చేపడుతున్న ఏజెన్సీ (మేఘా కంపెనీ)ని బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం చేతగానితనం వల్లే ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిందని వ్యాఖ్యానించారు. హడావుడిగా, ఆగమాగం పనులు చేయించడం వల్లే రిటైనింగ్ వాల్ కూలినట్టు సంబంధిత ఇంజనీర్లు తనతో చెప్పారని ఆయన అన్నారు. త్వరలోనే సుంకిశాలను సందర్శించి, అక్కడేం జరిగిందో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సుంకిశాల ప్రమాదం ఆగస్టు 2న జరిగిందని, దాదాపు వారం రోజుల పాటు ఆ విషయం బయటకు రాకుండా ప్రభుత్వం దాచిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం జరిగిందని, కోట్లాది రూపాయల ప్రజల సంపద నీట మునిగిందని అన్నారు.
మేడిగడ్డ కుంగితే వెంటనే బయటపెట్టినం
హైదరాబాద్ నగరానికి తాగునీటి కష్టాలు ఉండకూడదని తాము సుంకిశాల ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. ఎండాకాలంలో నగరంలో నీటి తిప్పలు ఏర్పడడంతో, అప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలంటూ అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం ఒత్తిడి చేసిందని, ఇలా ఆగమాగం పనులు చేయడం వల్లే రిటైనింగ్ వాల్ కూలిందని ఆయన ఆరోపించారు. అధికారులు చెప్పినా వినకుండా గేట్లు అమర్చటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కనీసం ఆ ప్రాజెక్టుపై రివ్యూ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘మంచి జరిగితే మాది. చెడు జరిగితే బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు వద్దు. పురపాలక శాఖను పర్యవేక్షించకుండా ఉన్న ముఖ్యమంత్రిదే దీనికి బాధ్యత. మేడిగడ్డ బ్యారేజీ కుంగితే మేము వెంటనే బయటపెట్టినం.
ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అడ్డగోలు విమర్శలు చేసింది. అవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. ఇప్పుడు అక్కడ పది లక్షల క్యూసెక్కుల వరద పోతున్నా బ్యారేజీ చెక్కు చెదరలేదు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. కేసీఆర్‌కు పేరు వస్తదని ఈ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు” అని కేటీఆర్ దుయ్యబట్టారు. కాళేశ్వరంలో ప్రమాదం జరిగితే ఎన్డీఎస్ఏ వచ్చిందని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘‘సుంకిశాల ప్రమాదంపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అనుకోవాలా?” అని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానందగౌడ్ ఉన్నారు.
కనీసం రివ్యూ చేయరా?
సుంకిశాల ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు లేకుంటే, జరిగిన ప్రమాదాన్ని ఇన్ని రోజులుగా ఎందుకు దాచారని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ జరిగేటప్పుడు రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా సభలో ప్రకటించాలన్న సంప్రదాయం ఉందని.. ప్రభుత్వం ఆ పని కూడా చేయలేదని విమర్శించారు. ‘‘తప్పు ఒప్పుకోవాల్సి వస్తుందనే ఈ విషయాన్ని ఇన్నాళ్లూ దాచారు. ఇప్పుడేమో బీఆర్‌ఎస్ మీద నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియదా? తెలిసి పట్టించుకోలేదా? ఒక వేళ సీఎంకు ఈ విషయమే తెలియదంటే మాత్రం ఇది సిగ్గుచేటు. ఆయనకు పాలనపై పట్టు లేనట్టే. కానీ, ఆయనకు తెలుసు అనే నేను అనుకుంటున్నా. ఈ ప్రమాదం గురించి తెలిసి కూడా, కనీసం రివ్యూ చేయకుండా అమెరికా వెళ్లిపోవడమేంది? ఇంతకంటే బాధ్యతా రాహిత్యం మరొకటి ఉండదు” అని ఆయన విమర్శించారు.