వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్ విధానం తేవాలి

వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్ విధానం తేవాలి

తెలంగాణను ఫెయిల్యూర్ స్టేట్గా చూపించాలనుకున్న మోడీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలుగేళ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరునెలల కింద గొప్పగా చెప్పుకున్న కేంద్రం..తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల క్రితం తాము విజ్ఞప్తి చేస్తే, దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం తిరస్కరించినట్లు చెప్పారు. అటువంటింది ప్రస్తుత కొరతకు కారణమేంటో చెప్పాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ను  డిమాండ్ చేశారు. ఆహార ధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానమంటూ లేకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమన్నారు.  

రాష్ట్ర ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పియూష్ గోయల్.. ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారెమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు మోడీ సర్కార్ నుంచి చేయూత అందడంలేదన్నారు. పుట్ల కొద్దీ ధాన్యం పండించి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. రైతులను వరి వెయ్యనియ్యకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఫలితంగా గత వానకాలం సీజన్‌తో పోల్చితే ఈసారి సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గినట్లు తెలిపారు.

దేశానికి ఒక సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యమే అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం తన విధానాలు మార్చుకొని ప్రజల సంక్షేమం, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణ విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని అమలుచేయకుండా దేశ రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి ఎలాంటి వివక్షకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.