అదంతా ఫేక్.. ఫాక్స్‌‌కాన్‌‌కు నేను లెటర్ రాయలే: డీకే శివకుమార్

అదంతా ఫేక్.. ఫాక్స్‌‌కాన్‌‌కు నేను లెటర్ రాయలే: డీకే శివకుమార్
  •     సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నరు
  •     సైబర్ క్రైమ్‌‌లో కేసు పెట్టానని వెల్లడి
  •     డీకే లెటర్ హెడ్‌‌ను దుండగులు ట్యాంపర్ చేశారు: చామల కిరణ్

హైదరాబాద్, వెలుగు: యాపిల్ ఎయిర్ పాడ్ తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఖండించారు. కంపెనీలు బెంగళూరుకు రావాల్సిందిగా ఎవరికీ తాను లేఖలు రాయలేదని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. తన పేరుతో ప్రచారం చేస్తున్నవి ఫేక్ లెటర్లని తేల్చిచెప్పారు. ‘‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని యాపిల్ ఎయిర్ పాడ్ తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను బెంగళూరుకు తరలించాల్సిందిగా ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌కు నేను రాసినట్టుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లెటర్ ఫేక్. బెంగళూరుకు తరలించాలంటూ నేను ఏ కంపెనీకీ లేఖలు రాయలేదు. ఈ ఫేక్​ లెటర్ సర్క్యులేషన్‌‌‌‌‌‌‌‌పై సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కేసు కూడా పెట్టాం’’ అని ట్వీట్ చేశారు.

అబద్ధపు ప్రచారాల్లో కేటీఆర్ నంబర్ వన్: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల

కేటీఆర్ కామెంట్లను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఖండించింది. డీకే శివకుమార్ లెటర్ హెడ్‌‌‌‌‌‌‌‌ను ట్యాంపర్​ చేసి ఇలాంటి ఫేక్ లెటర్లను సృష్టించారని ఆరోపించింది. శనివారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడిన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. అబద్ధపు ప్రచారాలు చేయడంలో కేటీఆర్ నంబర్ వన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. వార్ రూమ్ నుంచి డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడామని, ఆయన లెటర్ హెడ్‌‌‌‌‌‌‌‌ను దుండగులు ట్యాంపర్ చేశారని చెప్పారు. కేటీఆర్ ఒక గ్రామ స్థాయి లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను బ్లేమ్ చేసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు.