బర్త్ డే సందర్భంగా దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందజేసిన కేటీఆర్

బర్త్ డే సందర్భంగా దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందజేసిన కేటీఆర్

హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం కింద మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. జలవిహార్ లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని దివ్యాంగులకు బైకులు అందించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమాన్ని చేపట్టానన్నారు.

రాజకీయాల్లో ఒక్కోసారి అనవసర ఖర్చు కూడా చేయాల్సి రావడం జరుగుతుందని గుర్తు చేసుకున్నారు. బ్యానర్లు, హోర్డింగులు పెట్టి ఖర్చు చేస్తాం.. అలాంటివి తగ్గించుకోవాలన్నదే నా ఆలోచన అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వృథా ఖర్చులు మంచిది కాదని ఆయన తెలిపారు. గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా 100 అంబులెన్సులను ఆయా ఆస్పత్రులకు అందజేశానని గుర్తు చేశారు. గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా చేసిన పని చాలా సంతృప్తి కలిగించిందని.. అందు వల్ల ఈ యేడాది పుట్టినరోజును పురస్కరించుకుని వెయ్యి మోటార్‌ సైకిళ్లను దివ్యాంగులకు అందించేందుకు కృషి చేశానని తెలిపారు.

నా కోరికను గుర్తించిన  టీఆర్‌ఎస్‌ నేతలు సైతం స్వతహాగా ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయడం మంచి పరిణామం అన్నారు. త్రిచక్ర వాహనం అందించడం వల్ల దివ్యాంగుల జీవనోపాధికి ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, నవీన్ కుమార్,మాధవరం కృష్ణా రావు,వివేకానంద తదితరులు పాల్గొన్నారు.