కేంద్ర మంత్రి బండి సంజయ్‎పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

కేంద్ర మంత్రి బండి సంజయ్‎పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‎పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్‎పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు కేటీఆర్. కేటీఆర్ పిటిషన్‎ను‎ 2025, డిసెంబర్ 15కి వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్టు.

బండి సంజయ్ ఏమన్నారంటే..?

తెలంగాణ పాలిటిక్స్‎లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీను కేటీఆర్ సొంత అవసరాలకు వాడుకున్నారని.. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు.

గ్రూప్1 పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో నా ఫోన్ ట్యాప్ చేసి పోలీసులు ముందుగానే మా ఇంటికి వచ్చారని అన్నారు.  గ్రూప్–1 పేపర్ లీకేజీ కేసు విచారించిన జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.పెద్ద వ్యాపారుల ఫోన్లు, జర్నలిస్టులు ఫోన్లు కూడా  కూడా ట్యాప్ చేశారని అన్నారు. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతుండగా బండి సంజయ్ తనపై ఆరోపణలు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

►ALSO READ | తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం

ఈ మేరకు 2025, ఆగస్ట్ 12న బండి సంజయ్‎కు లీగల్ నోటీస్ పంపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై చేసిన ఆరోపణలపై 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలని.. లేదంటే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. నోటీసులపై బండి సంజయ్ స్పందిచకపోవడంతో కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు.