బావ జోరు.. బామ్మర్ది బేజారు

బావ జోరు..  బామ్మర్ది బేజారు

మెదక్, వెలుగు: రాష్ట్రంలో లోక్​సభ రిజల్ట్స్ పై బావా బామ్మర్దుల సవాల్​లో బావదే పై చేయి అయింది. మెదక్‌‌‌‌ ఎంపీ స్థానంలో టీఆర్​ఎస్​ క్యాండిడేట్​కు వచ్చే మెజార్టీకన్నా కరీంనగర్​ ఎంపీ సీట్లో ఒక్క ఓటైనా ఎక్కువ సాధిస్తామన్న టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ చాలెంజ్​ బుడగలా పేలిపోయింది. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో మార్చి 8న మెదక్‌‌‌‌లో టీఆర్​ఎస్​ ఎన్నికల సన్నాహక సభ జరిగింది. ఆ సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​‌‌రావు మాట్లాడుతూ.. మెదక్‌‌‌‌ ఎంపీ స్థానంలో ఐదు లక్షల మెజారిటీ సాధిస్తామని చెప్పారు. తర్వాత కేటీఆర్‌‌ మాట్లాడారు. ‘‘నేను ఈ రోజు సవాల్‌‌‌‌ విసురుతున్నా. ఎంపీ ఎన్నికల్లో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకువచ్చి రుజువు చేసుకోవాలి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌‌‌‌ లోక్​సభ స్థానంలో కంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న కరీంనగర్‌‌ ఎంపీ సీటులో ఒక్క ఓటైనా గ్యారంటీగా ఎక్కువ తెచ్చుకుంటాం.

మా కరీంనగర్‌‌‌‌ లీడర్లతో మాట్లాడి తప్పకుండా మీకంటే ఒక్క ఓటైనా ఎక్కువ సాధిస్తం..’’ అని చాలెంజ్​ చేశారు. ఈ బావాబామ్మర్దుల సవాల్‌‌ అందరినీ ఆకర్షించింది. ఎవరి సవాల్​ నెగ్గుతుంది, మెదక్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌ ఎంపీ స్థానాల్లో ఎవరు టీఆర్​ఎస్ క్యాండిడేట్లకు ఎక్కువ మెజారిటీ తీసుకువస్తారన్న చర్చ జరిగింది. అయితే గురువారం వెలువడిన రిజల్ట్​లో బావదే పైచేయిగా నిలిచింది. మెదక్‌‌‌‌ ఎంపీ స్థానంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి 3,16,388 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కరీంనగర్‌‌‌‌ ఎంపీ సీట్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థి వినోద్​కుమార్​ మెజార్టీ మాట అటుంచి ఓటమి పాలవడం గమనార్హం. హరీశ్‌‌ మూడు లక్షలకుపైగా ఓట్లతో టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ను గెలిపించి, తన పట్టును చాటుకోగా.. సొంత నియోజకవర్గమున్న కరీంనగర్‌‌ సీటును గెలిపించుకోవడంలో కేటీఆర్‌‌ విఫలమయ్యారు.

తేలిపోయిన ‘సారు.. కారు.. 16’

కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి, ఎర్రకోటపై జెండా ఎవరు ఎగరేయాలో తామే డిసైడ్‌‌ చేస్తామన్న టీఆర్‌‌ఎస్‌‌ పెద్దల మాటలను జనం విశ్వసించినట్టు కనిపించలేదు. కేంద్రంలో హంగ్​ వస్తుందని, టీఆర్​ఎస్​ 16 మంది ఎంపీలను గెలుచుకుంటే.. రాష్ట్రానికి కావాల్సినవాటిని ఢిల్లీ మెడలు వంచి తెచ్చుకోవచ్చని కేటీఆర్​ పదే పదే చెప్పారు. ‘సారు.. కారు.. 16.. ఢిల్లీలో సర్కారు’ అంటూ నినాదం ఇచ్చారు. ఇవేవీ ప్రజా తీర్పును ప్రభావితం చేయలేకపోయాయి. కేంద్రంలో మోడీకి ఏకపక్షంగా ప్రజలు అధికారాన్ని కట్టబెట్టడంతో వారికి ఎటువంటి సపోర్టూ అవసరం పడలేదు. ఇక్కడ 16 సీట్లు గెలవాలన్న టీఆర్‌‌ఎస్‌‌ లక్ష్యం కూడా తొమ్మిది సీట్ల దగ్గరే ఆగిపోయింది. చేవెళ్లలో నువ్వానేనా అన్నట్టు కాంగ్రెస్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ మధ్య పోరుసాగి చివరికి గులాబీ పార్టీ అభ్యర్థి రంజిత్‌‌రెడ్డి గెలిచారు.

‘ఇన్​చార్జి’ సీట్లూ గోవిందా..

టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌  హోదాలో కేటీఆర్​ ఇన్‌‌చార్జిగా వ్యవహరించిన సికింద్రాబాద్‌‌, మల్కాజిగిరి ఎంపీ సీట్లలోనూ టీఆర్‌‌ఎస్‌‌ ఓటమి పాలైంది. సికింద్రాబాద్‌‌లో బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. ఇక ‘చెల్లని రూపాయి’ అంటూ కేటీఆర్‌‌ ఎగతాళి చేసిన రేవంత్​రెడ్డి మల్కాజ్​గిరి ఎంపీ సీట్లో గెలిచారు. కేటీఆర్‌‌ గ్రామీణ నియోజకవర్గాల్లో తన ప్రచారానికి పుల్‌‌స్టాప్‌‌ పెట్టి మరీ.. సికింద్రాబాద్‌‌, మల్కాజిగిరి లోక్​సభ పరిధిలో రోడ్​ షోలు, ప్రచార సభలు నిర్వహించారు. అయినా పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకోలేకపోయారు. ఆయన ప్రచారం చివరి రోజు నల్గొండ సెగ్మెంట్లో క్యాంపెయిన్​ చేసినా అక్కడా పరాజయమే ఎదురైంది. చేవెళ్ల లోక్​సభ పరిధిలోని గ్రేటర్‌‌ హైదరాబాద్​ ప్రాంతాల్లో కేటీఆర్‌‌ రోడ్​ షోలు మాత్రమే అక్కడి క్యాండిడేట్​కు తోడుగా నిలిచాయి.