కేంద్ర  మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ

కేంద్ర  మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ

హైదరాబాద్: వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోన్న టెక్స్ టైల్ రంగాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో టెక్స్ టైల్, చేనేత రంగాలకు ప్రోత్సాహం కల్పించాలని కోరుతూ కేటీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. లేఖలో టెక్స్ టైల్, చేనేత రంగాలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. శుష్క వాగ్దానాలు–రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్... తెలంగాణ నేతన్నల కడుపు కొడుతోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలన్నారు. రాష్ట్ర టెక్స్ టైల్, చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని  లేఖలో కేటీఆర్ ఆరోపించారు. నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు నేతన్నల బాగు కోసం ఉద్యమించిన తాము...  అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామన్నారు. 

దేశంలోని ఎన్నో రంగాలను చేసినట్టుగానే టెక్స్ టైల్, చేనేత రంగాలను మోడీ నిర్వీర్యం చేశారన్నారు. అందుకే చేనేతపైన జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ఎటు పోయాయని ప్రశ్నించారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు ఆర్ధిక సాయం చేయాలని ఎన్నిసార్లు కోరినా... కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు.  కానీ సీఎం  కేసీఆర్ నాయకత్వంలో కాకతీయ  టెక్స్ టైల్ పార్కులో ప్రపంచ టెక్స్ టైల్ దిగ్గజాల్లో ఒకటైన యంగ్ వన్ కంపెనీ పెట్టుబడులు పెట్టిన సంగతిని కేటీఆర్ గుర్తుచేశారు. ఇంతటి జాతీయ ప్రాధాన్యత కలిగిన టెక్స్ టైల్  మెగా  పార్క్ కి కేంద్రం సహకారం అందించాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తి చేశారు. చేనేత పైన జిఎస్టీ  రద్దు చేయాలి,  టెక్స్ టైల్స్ పైన జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలోని చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ అగస్టు 7తేదిన జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి టెక్స్ టైల్స్, చేనేత రంగంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.