సెప్టెంబర్​లోనే ఎన్నికల నోటిఫికేషన్..

సెప్టెంబర్​లోనే  ఎన్నికల నోటిఫికేషన్..
  • మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ హింట్
  • టికెట్ల కోసం తరలివచ్చిన లీడర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్​లో నోటిఫికేషన్,​ అక్టోబర్​లో పోలింగ్​ఉంటుందని, రెడీగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్​ హింట్ ఇచ్చారు. శుక్రవారం అసెంబ్లీలోని కేటీఆర్​ చాంబర్​లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను కలిశారు. వారితో కేటీఆర్​మాట్లాడుతూ, సెప్టెంబర్​మొదట్లోనే ఎన్నికల షెడ్యూల్, మూడో వారంలో నోటిఫికేషన్​వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికలకు అందరు రెడీగా ఉండాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలని సూచించారు. అక్టోబర్​నెలాఖరులో పోలింగ్ ఉంటుందని చెప్పారు. రైతు రుణమాఫీ, నోటరీ ల్యాండ్స్​రెగ్యులరైజేషన్, దళితబంధు, బీసీ కులవృత్తులు, మైనార్టీలకు రూ.లక్ష సాయం సహా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.

కేటీఆర్​ను కలిసేందుకు పోటెత్తిన నేతలు

అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్​ను కలిసేందుకు బీఆర్ఎస్​నేతలు పోటెత్తారు. అసెంబ్లీకి టీ బ్రేక్​ఇచ్చిన తర్వాత లాబీ నుంచి తన చాంబర్​వైపు వస్తూ.. అక్కడ గుమికూడి ఉన్న నేతలను చూసి అసహనానికి గురయ్యారు. ‘‘ఇంత మంది జనాలెలా లోపలికి వచ్చారు.. ఎవరు రానిచ్చారు..” అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంత మందిని ఎలా రానిచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత తనను కలిసిన కొందరు నాయకులపైనా అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 
చాలా మంది నేతలు తన చాంబర్​వద్దనే ఉండటంతో కేటీఆర్​రాత్రి వరకు మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆయన రాకకోసం నేతలంతా లాబీల్లోనే పడిగాపులు కాశారు. రాత్రి ఏడున్నర గంటల తర్వాత కేటీఆర్​తన చాంబర్​కు వచ్చి కొందరు నేతలను పిలిపించి మాట్లాడారు.

టికెట్ ​ప్లీజ్..

తమకు టికెట్​ఇవ్వాలని పలువురు నేతలు మంత్రి కేటీఆర్​ను కలిసి అభ్యర్థించారు. స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే టికెట్​తన కూతురు కావ్యకు ఇవ్వాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కేటీఆర్​ను కోరినట్టు తెలిసింది. కేటీఆర్ ​చాంబర్​లో శ్రీహరి ఉన్నంత సేపు ప్రస్తుత స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే రాజయ్య లాబీలో ఆయన చాంబర్​కు ఎదురుగా వేచి చూస్తూ కనిపించారు. ఉమ్మడి వరం గల్​జిల్లాకు చెందిన దాదాపు పది మంది వరకు లీడర్లు కేటీఆర్​ను కలిసి తమకు చాన్స్​ ఇప్పించాలని కోరారు. హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నాయకులు కేటీఆర్​ను కలిసి తమకు టికెట్​లేదంటే ఇతరత్రా అవకాశాలు కల్పించాలని అభ్యర్థించినట్టు తెలిసింది.

నాకు ఎవరూ క్లోజ్​ కాదు..

తనకు ఎవరూ క్లోజ్​కాదని.. చందర్ ​రామగుండం ఎమ్మెల్యే కాబట్టే ఆయనతో మాట్లాడుతున్నానను తప్ప ఆయన తనకు దగ్గర అని అనుకుంటే ఎలానని రామగుండం బీఆర్ఎస్ ​అసంతృప్త నేతలను మంత్రి కేటీఆర్ ​ప్రశ్నించారు. అక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్న నాయకులతో శుక్రవారం రాత్రి కేటీఆర్​సమావేశమయ్యారు. తమపై ఎమ్మెల్యే ఎలాంటి కేసులు పెట్టి వేధించారో వారు కేటీఆర్​కు వివరించారు. కేటీఆర్​స్పందిస్తూ.. కేసులు పెట్టిన విషయం తనకు తెలియదని, తనకు పార్టీలోని నాయకులంతా సమానమేనని చెప్పారు. సర్వే రిపోర్టు ప్రకారమే టికెట్లు ఇస్తామని, పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడొద్దని, నష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోరారు. రామగుండం నియోజకవర్గ ఇన్​చార్జీగా మంత్రి కొప్పుల ఈశ్వర్​కు బాధ్యతలు ఇస్తున్నానని, ఆయనతో కలిసి పనిచేయాలని సూచించారు.

కేటీఆర్​ను కలిసిన పమేలా.. గంటల్లోనే పోస్టింగ్ 

యాదాద్రి భువనగిరి కలెక్టర్​గా పనిచేసి బదిలీ వేటు పడిన పమేల సత్పత్తి శుక్రవారం ఉదయం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్​ను కలిశారు. మంత్రిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆమెకు పోస్టింగ్​ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు మరో ఐఏఎస్​అధికారికి మంత్రి కేటీఆర్​శాఖల్లోనే పోస్టింగ్​ఇస్తూ జీవో ఇచ్చారు. పమేలా సత్పతిని కమిషనర్​అండ్ ​డైరెక్టర్, మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్​గా నియమించి ఆ స్థానంలో అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న సుదర్శన్​రెడ్డిని రిలీవ్​చేశారు. కృష్ణభాస్కర్​ను ఇండస్ట్రీస్​డైరెక్టర్​గా నియమించి ఆ స్థానంలో అదనపు బాధ్యతల్లో పని చేస్తున్న నర్సింహారెడ్డిని రిలీవ్​చేశారు.