కేసీఆర్ ను తిడితే కేసులు పెడ్తం

కేసీఆర్ ను తిడితే కేసులు పెడ్తం

వరంగల్‍ రూరల్‍/వరంగల్‍, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్‍ను ఇక నుంచి ఎవరైనా బీజేపీ లీడర్లు ఇష్టమొచ్చినట్లు తిడితే.. లా అండ్​ ఆర్డర్‍ కేసులు పెడ్తం. భాష మార్చుకోకుంటే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‍షాను కూడా వదలకుండా ఉతికి ఆరేస్తాం. ఇదే నా చివరి హెచ్చరిక’’ అంటూ మంత్రి కేటీఆర్‍  సీరియస్‍ అయ్యారు. బీజేపీ లీడర్ల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే కేయూ స్టూడెంట్​ సునీల్​ నాయక్​ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. సోమవారం వరంగల్‍ సిటీలో కేటీఆర్​ పర్యటించారు. రేపోమాపో వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​కు ఎన్నికలు ఉన్న క్రమంలో  ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి డ్రికింగ్‍ వాటర్‍, భద్రకాళి బండ్‍, జైన మందిర్‍ ప్రారంభోత్సవాలకు తోడు భవిష్యత్తులో చేపట్టబోయే పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఫోర్ట్​ వరంగల్‍, హన్మకొండ, శాయంపేట సభల్లో పాల్గొన్నారు. ఎన్‍ఐటీలో ప్రెస్‍మీట్‍ పెట్టారు.  ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. ‘‘కొత్త బిచ్చగాళ్లు కొందరొచ్చిన్రు.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్రు.. తెలంగాణ సాధించిన నాయకుడనే సోయిలేని సన్యాసులున్నరు. కేసీఆర్‍ వయసును చూడకుండా, పెద్ద మనిషి అనే సంస్కారం లేకుండా, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా ఆయనపై ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడనే సోయి వాళ్లకు లేకపోవడం దౌర్భాగ్యం. నోటికొచ్చినట్లు కేసీఆర్‍ గురించి మాట్లాడుతున్రు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాట్లాడటం స్టార్ట్​ చేస్తే మొఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. ‘‘మాట్లాడాలనుకుంటే మీకంటే ఎక్కువ మాట్లాడవచ్చు. నాలుకను వాడాలనుకుంటే మీకంటే ఇంకా ఎక్కువ మాట్లాడగలుగుతం.. కేసీఆర్‍ను బూతులు తిట్టాలనే దౌర్భగ్య పార్టీకి, లీడర్లకు ఒక్కటే చెబుతున్నా.. మీకు దమ్ముంటే ఆరోగ్యకరమైన పోటీకి రండి. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది” అని అన్నారు. వరంగల్‍కు గడిచిన ఆరేండ్లలో తాము ఎంత ఖర్చు చేశామో వారంలో శ్వేత పత్రం రిలీజ్ చేస్తామని కేటీఆర్‍ చెప్పారు. బీజేపీ లీడర్లకు చాతనైతే అంతకంటే రెట్టింపు పైసలు తీసుకురావాలని సవాల్‍ విసిరారు. ‘‘కాజీపేటలో కోచ్​ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్​ యూనివర్సిటీ విషయంలో సంస్కారంతో సమాధానం చెప్పలేని సన్నాసులు బీజేపీ లీడర్లు” అని ఆయన మండిపడ్డారు. వరంగల్‍కు నియో ట్రైన్‍, మామూనూర్‍ ఎయిర్‍పోర్ట్‍ తెచ్చే బాధ్యత తమదేనన్నారు. బీజేపీ లీడర్ల రెచ్చగొట్టే ప్రసంగం వల్లే కేయూ స్టూడెంట్‍ సునీల్‍ నాయక్‍ సుసైడ్‍ చేసుకున్నాడని, తన పర్యనటలోనూ  ఏబీవీపీ స్టూడెంట్లను కూడా అలానే రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. 

కొత్త రేషన్‍ కార్డులు, జర్నలిస్టులకు ఇండ్లు 

కరోనా కారణంగా డబుల్‍ బెడ్రూం ఇండ్ల మంజూరు లేటైందని కేటీఆర్​ అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‍ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం హామీ ప్రకారం రాష్ట్రమంతటా జర్నలిస్టులకు డబుల్‍ బెడ్రూం ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్‍ తూర్పు జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. 

కేటీఆర్​ టూర్‍లో నిరసనలు.. సభలో మంటలు

కేటీఆర్‍ టూర్‍ సందర్భంగా ఏబీవీపీ స్టూడెంట్లు, సీపీఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసులు ముందస్తుగా కేయూ స్టూడెంట్​సంఘాల నేతలను, ఏబీవీపీ నేతలను, బీజేపీ, కాంగ్రెస్‍ పార్టీ లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కేటీఆర్‍ కాన్వాయ్‍ హన్మకొండ నుంచి వరంగల్‍ వచ్చే క్రమంలో పోచమ్మమైదాన్‍ రత్న హోటల్‍ ప్రాంతంలో ఏబీవీపీ లీడర్లు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డుగా వచ్చి నిరసన తెలిపారు. పోలీసుల రోప్‍ పార్టీని దాటుకుంటూ కేటీఆర్‍ బస్సు వద్దకు వచ్చి, జాబ్స్​ నోటిఫికేషన్స్​ వేయాలంటూ నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. సాయంత్రం పోలీస్‍ హెడ్‍క్వార్టర్స్‍ పబ్లిక్​ గార్డెన్‍ వద్ద సీపీఎం కేడర్​ ఇలానే బస్సు ముందుకు వచ్చి నిరసన తెలిపింది. సాయంత్రం హన్మకొండ శాయంపేట సభలో పాల్గొనేందుకు  కేటీఆర్‍, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాగా.. అక్కడ స్టేజీపై కార్యక్రమ నిర్వాహకులు చిచ్చుబుడ్డీలు అంటుపెట్టారు. అప్పటికే అక్కడ పింక్‍ కలర్‍ పేపర్లు ఎక్కువ చల్లడంతో అవన్నీ అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో స్టేజీ మీదున్న లీడర్లు, ముందున్న జనాలు ఆందోళనకు గురయ్యారు. పోలీస్‍ సిబ్బంది మంటలను చల్లార్చారు. 

ఎవడీ సంజయ్‍.. ఎవడా ఉత్తమ్‍?

‘‘కేసీఆర్​, టీఆర్​ఎస్​ లేకపోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్​ ఎక్కడివి..? ఎవడీ బండి సంజయ్, ఎవడా ఉత్తమ్​ కుమార్​ రెడ్డి..? ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగినోళ్లు వీళ్లు..” అంటూ కేటీఆర్​ తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఏడేండ్లలో దేశంలో మోడీ ఇచ్చిన ప్రభుత్వ కొలువులేమిటో, అమ్మిన ప్రభుత్వరంగ సంస్థలెన్నో చెప్పాలన్నారు. పోయిన ఐదారేండ్లలో బీజేపీ, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చర్చకు రావాలని డిమాండ్‍ చేశారు.