ఆర్టీసీపై సీఎం ఏం మాట్లాడారో..మనం అదే మాట్లాడుదాం..

ఆర్టీసీపై సీఎం ఏం మాట్లాడారో..మనం అదే మాట్లాడుదాం..

హైదరాబాద్, వెలుగు:  పార్లమెంట్‌లో ఆర్టీసీ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందని, ఈ విషయంలో ఎదురుదాడికి సిద్ధంకావాలని టీఆర్ఎస్​ ఎంపీలకు ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ ఆదేశించినట్టు సమాచారం. సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో ఏ మాటలు చెప్తున్నారో.. అక్కడ కూడా అవే వినిపించాలని సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్​లో జరిగిన సమావేశంలో ఎంపీలకు కేటీఆర్​ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ‘‘హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెపై పార్లమెంట్ లో ఏకమయ్యే చాన్స్ ఉంది. కరీంనగర్  బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చారు. టీఆర్ఎస్​ సర్కారును ఇరుకున పెట్టే చాన్స్​ ఉంది. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలె. ఎదురుదాడి చేయాలె. కేంద్రం చట్టం మేరకే ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చామని చెప్పాలె. ఆర్టీసీ విభజన చేయకుండా కేంద్రం జాప్యం చేస్తున్నదని ప్రస్తావించాలె..” అని మంత్రి సూచించినట్టు తెలిసింది.

తలోరకంగా మాట్లాడొద్దు

ఆర్టీసీ విషయంగా సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో ఏం చెబుతున్నారో, అవే అంశాలను పార్లమెంట్‌లో కూడా వినిపించాలని, తలో రకంగా మాట్లాడొద్దని కేటీఆర్​ స్పష్టం చేసినట్టు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీల పరిస్థితి కూడా తెలుసుకోవాలని, అవసరమైతే వాటిని ప్రస్తావించాలని సూచించినట్టు తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆర్టీసీపై అధికారికంగా ఒకరో, ఇద్దరో మాత్రమే మాట్లాడేలా ప్లాన్ చేద్దామని ఎంపీలకు చెప్పినట్టు సమాచారం.

కాళేశ్వరంపై నోరు తెరవొద్దు!

కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన అంశం కూడా ఎంపీల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం సున్నితమైన అంశమని, దానిపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని కేటీఆర్  సూచించినట్టు తెలిసింది. ‘‘మనం ఒక ప్రకటన చేస్తే తిరిగి ఏపీ నాయకులు కౌంటర్ ఇస్తరు. ఇది మరింత వివాదానికి దారి తీస్తుంది. కాళేశ్వరంపై  పార్లమెంట్ లో ప్రస్తావన వస్తే అప్పుడు ఏం చేయాలనే దానిపై చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం” అని స్పష్టం చేసినట్టు సమాచారం.