లోకేశ్, రాహుల్ గాంధీల్లా అసమర్థుడు కాదు.. కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హత ఉంది

లోకేశ్, రాహుల్ గాంధీల్లా అసమర్థుడు కాదు.. కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హత ఉంది

వరంగల్ రూరల్: కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన అన్ని విధాల సమర్థుడని, ఆయన నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించామని చెప్పారు. అయితే కేటీఆర్ సీఎంగా ఎప్పుడవుతారన్నది కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు ఎర్రబెల్లి. చంద్రబాబు కొడుకు లోకేశ్‌, సోనియా గాంధీ కొడుకు రాహుల్  గాంధీల్లా కేటీఆర్ అసమర్థుడు కాదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం ప్రభుత్వాన్ని నడపగాలేని, రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

ఇవాళ వరంగల్ రూరల్ జిల్లా దమ్మన్న పేటలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు బాగుపడాలనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యాయన్నారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని గతంలో కాంగ్రెస్ నాయకులు అన్నారని గుర్తు చేశారు ఎర్రబెల్లి. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే 24 గంటల కరెంట్, ప్రజలందరికీ తాగునీరు, సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేశారన్నారు.