మోడీ, రాహుల్‌‌కు భయపడను

మోడీ, రాహుల్‌‌కు భయపడను
  • సోషల్ మీడియా కార్యకర్తల మీటింగ్ లో కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ‘‘నాకు మోడీ అన్నా, రాహుల్ అన్నా ఏం భయం లేదు. బీజేపీ అన్నా భయం లేదు. బీజేపీ అంటే భయమని లక్ష్మణ్​ అంటున్నారు. తెలంగాణలో బీజేపీకి ఏముందని భయపడాలె. మున్సిపోల్స్​లో ఆరు వందలకుపైగా చోట్ల బీజేపీ నుంచి పోటీ చేసేందుకు క్యాండిడేట్లే లేరు’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణభవన్ లో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో కేటీఆర్​ సమావేశమయ్యారు. సోషల్ మీడియా గులాబీ సైనికులకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పెన్షన్లలో కేంద్రం వాటా గురించి బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియా కార్యకర్తలు సబ్జెక్టుపై బీజేపీని తిప్పికొట్టాలని చెప్పారు.

అండగా ఉంటం..

కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు చిచ్చుపెట్టేందుకే సోషల్ మీడియాను వాడుకుంటున్నాయని కేటీఆర్​ ఆరోపించారు. కొన్ని పార్టీలకు పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తలే తప్ప అభిమానులు లేరని కామెంట్​ చేశారు. సీఎం కేసీఆర్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని.. పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి సోషల్  మీడియా మంచి సాధనమని నమ్ముతారని చెప్పారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు జరిగితే పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీలకు ఎక్కువ నిధులిచ్చామని పీసీసీ చీఫ్​ ఉత్తమ్ అంటున్నారని.. దమ్ముంటే వాళ్లు శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్​ చేశారు. కాంగ్రెస్  పాలనలో విడుదల చేసిన నిధుల కంటే తాము గత ఐదేండ్లలో రెట్టింపు నిధులు విడుదల చేశామన్నారు.