- అబద్ధాలు ప్రచారం చేసేవారి చెంప చెళ్లుమనిపించేలా హైకోర్టు తీర్పు
- ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రజలు, రైతుల విజయం
- ఇప్పటికైనా చిల్లర ప్రచారాలు బంద్ పెట్టి ప్రాజెక్టు రిపేర్లపై దృష్టి పెట్టాలి
- రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయవద్దు
- రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం
- కాళేశ్వరంపై స్వతంత్ర విచారణ జరిపించాలి
- పిల్లర్లు కూలడం వెనుక కుట్ర ఉందని మా అనుమానం
- కాళేశ్వరంపై తీర్పు నేపథ్యంలో మీడియాతో కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులుగా చేస్తున్న అన్ని కుట్రలకు, కుటిల ప్రయత్నాలకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ముగింపు పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాలేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అంటూ పిట్టల దొరల మాదిరి అడ్డగోలుగా అబద్ధపు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు, సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు చెంప చెల్లుమనిపించే తీర్పు ఇచ్చిందన్నారు. కూలింది కాలేశ్వరం కాదు అని, కాంగ్రెస్ పార్టీ గారడీ మాటలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు కూలిపోయాయని, తెలంగాణ ప్రజలు గెలిచారని కేటీఆర్ అన్నారు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు అది, పీసీసీ నివేదిక అని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే కాలేశ్వరం ప్రాజెక్టు పైన కుట్రలు చేస్తోందని తాము ముందు నుంచీ చెబుతున్న మాటలకు హైకోర్టు తీర్పు సాక్ష్యంగా నిలిచిందన్నారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ మీద రాహుల్ గాంధీని నిలబెట్టి, అక్కడ ఉన్న ఒక పర్రెను చూపిస్తూ “ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకుపోయింది” అని చెప్పి చేసిన ప్రచారం హైకోర్టు తీర్పుతో కొట్టుకుపోయిందన్నారు.
‘‘గోబెల్స్ ను మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులందరికీ ఇవాళ గుణపాఠం చెప్పే తీర్పును ఇచ్చిన హైకోర్టుకు మా పార్టీ పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు. ఇవాళ గెలిచింది తెలంగాణ రైతులు”అని కేటీఆర్ అన్నారు.
ఇప్పటికైనా ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి..
కాలేశ్వరం పైన దుష్ప్రచారాలు చేస్తూ గాసిప్స్ పైన దృష్టి పెట్టకుండా గవర్నెన్స్(పాలన) మీద దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు. రాజకీయాల కోసం కాలేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టకుండా.. అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పైన, పార్టీ నేతల పైన కోపం ఉంటే ఎన్ని విచారణలైనా చేసుకోవాలని, కానీ రైతులను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపైన కాంగ్రెస్ దుర్మార్గులే ఏదో కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. కుట్ర ఆ విషయం కూడా నిలకడగా తెలుస్తుందన్నారు. 94వేల కోట్ల రూపాయల కాలేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కూలి 400 కోట్ల రూపాయల మరమ్మతులు అవసరమయ్యాయని, వాటిని స్వయంగా కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సంస్థనే తిరిగి కడతామన్నా వారిని బెదిరించి మరి అడ్డుకొని కాలేశ్వరం పూర్తిగా కూలిపోయేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం...
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తున్నదని, రేవంత్ రెడ్డి హైబ్రిడ్ సీఎం అని పొద్దున కాంగ్రెస్, రాత్రి బీజేపీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టుపైన అడ్డగోలు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఆరోజు కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే ఆగ మేఘాల మీద ఎన్డీఎస్ఏ వచ్చి 48 గంటల్లో రిపోర్టు ఇచ్చిందని, ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలితే, వట్టెం పంప్ హౌజ్, సుంకిశాల కూలితే ఎన్డీఎస్ఏ ఎక్కడ పోయిందని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇప్పటికైనా చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరంపై స్వతంత్ర విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘‘సీఎం బావమరిదికి అమృత్ స్కీమ్ ఎలా వచ్చింది? సింగరేణిలో సీఎం బావమరిది కుంభకోణాలు అన్నీ బయటపెట్టాము. ఎందుకు విచారణ చేపట్టడం లేదు” అని కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ప్రశ్నించారు.

