ఏడాదిలో 1.27 లక్షల ఐటీ  ఉద్యోగాలు కల్పించినం: కేటీఆర్

ఏడాదిలో 1.27 లక్షల ఐటీ  ఉద్యోగాలు కల్పించినం: కేటీఆర్
  • కేంద్రం సహకరించకున్నా అద్భుతాలు చేస్తున్నం: కేటీఆర్
  • బెంగళూరును మించి ఐటీ సెక్టార్‌‌‌‌లో ప్రగతి సాధించినం
  • ఐటీ ఉద్యోగుల సంఖ్య 9,05,715కి పెరిగింది
  • ఐటీ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: కేంద్రం సహకరించకున్నా ఐటీలో అద్భుతాలు సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం టీ హబ్‌‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్​ అండ్ ​కమ్యూనికేషన్స్​2022 – 23 యాన్యువల్​ రిపోర్టును ఆయన రిలీజ్​చేసి మాట్లాడారు. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఐటీలో ఎంతో ప్రగతి సాధించిందని చెప్పారు. ‘‘నేను ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అధికారులు, నిపుణులను కలుపుకొని చేసిన ప్రయత్నాలతోనే విజయాలు సాధ్యమయ్యాయి. ఐటీలో బెంగళూరుతో పోటీ పడుతామని 2014లో చెప్పాను. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు బెంగళూరును మించి ఐటీ సెక్టార్​లో ప్రగతి సాధించాం” అని అన్నారు. 

ఏడాది కాలంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్​రంగాల్లో 1,27,594 కొత్త ఉద్యోగాలు కల్పించామన్నారు. 2013 –14లో 3,23,396 మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఇప్పుడు 9,05,715 మందికి పెరిగారని చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష ఉద్యోగాలకు మూడు రెట్లు అదనంగా పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు చేరాయన్నారు. ఏడాదిలోని 31.44 శాతం ఐటీ ఎగుమతులు పెరిగాయన్నారు. తెలంగాణ సెకండ్​ ఐటీ పాలసీ (2021 – 26)లో భాగంగా ఐటీ ఎగుమతులు రూ.3 లక్షల కోట్లకు, ఉద్యోగాలు 10 లక్షలకు పెంచాలని టార్గెట్​గా పెట్టుకున్నామని, కానీ రెండేళ్ల ముందే 2024 నాటికే ఈ లక్ష్యం పూర్తి చేస్తామన్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా తన టీమ్​కనబరుస్తున్న పనితీరుతోనే ఇది సాధ్యమవుతున్నదని చెప్పారు.

సైబర్​ వారియర్స్‌‌‌‌ను తయారు చేస్తం

దేశాలు పరస్పరం తలపడే యుద్ధాలు భవిష్యత్‌‌‌‌లో ఉండకపోవచ్చని, రానున్న రోజుల్లో సైబర్​వార్స్​ఎక్కువగా ఉంటాయని కేటీఆర్ అన్నారు. దీనికి అనుగుణంగా దేశానికి అవసరమైన సైబర్​వారియర్స్‌‌‌‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇటీవల తన యూకే, అమెరికా పర్యటనల్లో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. గూగుల్, అమెజాన్​ సహా అనేక ప్రఖ్యాత కంపెనీలు తమ హెడ్​క్వార్టర్స్​ కాకుండా హైదరాబాద్​లో అతిపెద్ద యూనిట్లు ఏర్పాటు చేశాయని, రానున్న రోజుల్లో మరికొన్ని ఏర్పాటు చేయబోతున్నాయని తెలిపారు. హైదరాబాద్ బయట వరంగల్, హనుకొండలో ఇప్పటికే ప్రఖ్యాత ఐటీ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేశాయన్నారు. మహబూబ్​నగర్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, బెల్లంపల్లిలో తమ యూనిట్ల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. ఎలక్ట్రానిక్స్​రంగంలో రాష్ట్రానికి రూ.38 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 31 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. ఫాక్స్​కాన్ ​కొంగర కలాన్​లో తమ యూనిట్‌‌‌‌ను ఏర్పాటు చేస్తోందని, దీనితో లక్ష మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని, టీ హబ్​–2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్​సెంటర్​అని, 2 వేల స్టార్టప్స్​ఇక్కడ పని చేసే అవకాశముందన్నారు.

సూపర్ మార్కెట్‌‌‌‌లో దొరకని వస్తువులు నాలాల్లో దొరుకుతున్నయ్

హైదరాబాద్‌‌‌‌లోని సూపర్ మార్కెట్‌‌‌‌లో దొరకని వస్తువులు కూడా నాలాల్లో దొరుకుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌‌‌‌లోని అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ‘రీ థింక్, ఎన్విరాన్‌‌‌‌మెంటల్ సర్వేలెన్స్‌‌‌‌ లాబారోటరీ’ని ప్రారంభించారు. తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ‘‘అంతా ప్రభుత్వం చూసుకుంటుందని ప్రజలు తమ బాధ్యతను మరుస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండటానికి నాలాల పూడికతీత చేపడుతాం. షాపుల్లో లభించని వస్తువులు నాలాల్లో దొరుకుతున్నాయి. నాగరిక సమాజంలో బతకాలనే సోయి ఉన్న వారెవరూ ఇలా చేయరు. ‘ఇల్లు మాత్రమే నాది.. రోడ్డు, నాలాలు నావి కాదు.. అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది’ అన్నట్లుగా వ్యవహరించడం మంచిది కాదు.” అని అన్నారు.