బీఆర్ఎస్ వస్తే స్కీంలు..కాంగ్రెస్ వస్తే స్కాంలు: కేటీఆర్

బీఆర్ఎస్ వస్తే స్కీంలు..కాంగ్రెస్ వస్తే స్కాంలు: కేటీఆర్

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే స్కీములు..కాంగ్రెస్ వస్తే స్కాములని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఓటుకు నోటు దొంగ చేతికి  రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో ఏటూ జడ్ స్కాములేనని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే సంవత్సరానికో ముఖ్యమంత్రి మారుతారని.. సీల్డ్ కవర్ సీఎంలు వస్తరని ఎద్దేవా చేశారు. వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో మాట్లాడిన కేటీఆర్.. గ్యారంటీ, వ్యారంటీ లేని పార్టీ కాంగ్రెస్  అని.. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ పోయి  3 గంటల కరెంటు వస్తదని చెప్పారు.

ALSO READ: బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపింది: జీవన్ రెడ్డి

పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్సేనని  విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు  వనపర్తిని పట్టించుకోని చిన్నారెడ్డి ఇపుడు సన్నాయి నొక్కులు తొక్కుతున్నారని మండిపడ్డారు.  ఏపీ నీళ్లు తీస్కపోతుంటే హారతి పట్టింది కాంగ్రెస్ లీడర్లు కాదా అని ప్రశ్నించారు. నీళ్లిచ్చింది బీఆర్ఎస్...కన్నీళ్లీచ్చింది కాంగ్రెస్ అన్నారు.  కాంగ్రెస్ అంటేనే కరువులు కన్నీళ్లని ఎద్దేవా చేశారు. 

అభివృద్ధిలో సిద్దిపేట, సిరిసిల్లతో  వనపర్తి పోటీపడుతోందన్నారు కేటీఆర్. వనపర్తికి మెడికల్ కాలేజీలు,నర్సింగ్ కాలేజీలు వచ్చాయన్నారు.   60 ఏళ్లలో చేయలేనిది 9 ఏళ్లలో చేశామని చెప్పారు. ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేలా ఓట్లు వేయాలన్నారు. సిరిసిల్ల,సిద్దిపేటలో వచ్చినట్టే వనపర్తిలో మెజారిటీ రావాలన్నారు. నిరంజన్ రెడ్డిని రికార్డ్ మెజారిటితో గెలిపించాలని కోరారు. వనపర్తిని జిల్లాను చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. వనపర్తిలో రూ.650 కోట్లతో రోడ్లు, రూ. 62 కోట్లతో నూతన కలెక్టరేట్ ను నిర్మించుకున్నామని  తెలిపారు.

 పాలమూరుది 60 ఏళ్ల అరిగోస అని గతంలో కాంగ్రెస్ పాలకులు పాలమూరు జిల్లాకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు.  ప్రతియేటా 4 లక్షల మంది పాలమూరు  బిడ్డలు వలస వెళ్లేవారని చెప్పారు.  ఏపీ,తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి  చేసింది కాంగ్రెస్సేనని చెప్పారు.