
- బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలి
- మోదీ, రాహుల్ కూర్చుంటే చాయ్ తాగేలోపు సవరణ చేయొచ్చు
- కులగణనలో ఐదున్నర శాతం వరకు బీసీ జనాభా తగ్గించారు
- మేం అన్ని ఎన్నికల్లో బీసీలకు 50శాతానికిపైగా టికెట్లు ఇచ్చాం
- సర్వేతో ఈ సర్కార్ బలహీనవర్గాల గొంతు కోసింది
- గ్రామాల్లో ప్రెస్మీట్లు పెట్టి ప్రజలను మేల్కొల్పుతామని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన తప్పుల తడక అని, అది చిత్తుకాగితంతో సమానమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ సర్వేతో సర్కారు బలహీనవర్గాల గొంతు కోసిందని మండిపడ్డారు. దీన్ని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకోరన్నారు. కులగణన రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ‘‘కులగణనలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలేదంటున్న సర్కారు.. ఈసారి శాస్త్రీయంగా కులగణన సర్వే చేయాలి. అప్పుడు మేం కూడా సర్వేలో పాల్గొంటం. వివరాలన్నీ ఇస్తం” అని ఆయన ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ బీసీ నేతల సమావేశం జరిగింది. కులగణనపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కూర్చొని చర్చిస్తే చాయ్ తాగే లోపు రాజ్యాంగ సవరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ముల్కీ రూల్స్ ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా? అని అన్నారు. బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేస్తలేరని ఆయన ప్రశ్నించారు.
బీసీ జనాభాను తగ్గించిన్రు
బీసీల జనాభాను కాంగ్రెస్ సర్కార్ ఐదున్నర శాతం తక్కువగా చూపించిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘22 లక్షల మంది బీసీలు లేరన్నట్టు ఈ సర్కార్ చూపెట్టింది. 42% రిజర్వేషన్ల హామీని రేవంత్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. దీనిపై శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నిరసనను తెలిపాం. బలహీనవర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు. శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలి” అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో, రేషన్ కార్డుల్లో, ఇండ్ల కేటాయింపుల్లో, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని అట్టడుగుస్థాయిలో ఉన్న ఎంబీసీలు, బీసీ బిడ్డలు భయపడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం మా హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను తప్పుపడుతున్నది. అందులోని బీసీ జనాభాను తప్పుపడుతూ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చింది. 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పింది. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని సిద్ధరామయ్య నోటి వెంట కాంగ్రెస్ పార్టీ చెప్పించింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రొక్యూర్మెంట్లలో 42% బీసీలకే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ సంవత్సరం గడిచినా 15 పైసలు కూడా బీసీ డీక్లరేషన్ కోసం ప్రభుత్వం కేటాయించలేదు. కొత్తగా బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని.. ఒక్కో కార్పొరేషన్ 50 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి 50 పైసలు కూడా ఇవ్వలేదు" అని విమర్శించారు.
రేవంత్ క్షమాపణ చెప్పాలి
‘‘బీసీలను మోసం చేసినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నే కులగణన సర్వేను చిత్తుకాగితంతో సమానమని కాలబెట్టిండు. 42% రిజర్వేషన్లు ఇస్తామన్న మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. దీనిపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాం. కానీ బిల్లు తేలేదు సొల్లు మాత్రం చెప్పారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మాత్రమే బీసీలకు 50 శాతానికి పైగానే పార్టీ పరంగా అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిందని తెలిపారు. ‘‘బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, జిల్లా కేంద్రాల వారీగా భావజాల వ్యాప్తిని ప్రారంభిస్తం. ప్రజలను మేల్కొల్పుతం. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రెస్మీట్లు, చిన్న చిన్న సమావేశాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తం” అని కేటీఆర్ పేర్కొన్నారు.