బీజేపీ బీసీ అధ్యక్షుడిని తొలగించి.. ఇప్పుడు బీసీ సీఎం అంటోంది: కేటీఆర్

బీజేపీ బీసీ అధ్యక్షుడిని తొలగించి.. ఇప్పుడు బీసీ సీఎం అంటోంది: కేటీఆర్
  • కేసీఆరే సీఎం అని 2018 ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయ్యాం
  • ఇప్పుడు మా తలరాతలు ప్రజల చేతుల్లో ఉన్నాయి
  • రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులున్నారన్నది నిజం కాదు
  • అన్ని రకాల పోటీ పరీక్షలు రాస్తున్నది కేవలం 12 లక్షల మందే
  •  కర్నాటక పోయి తేల్చుకుందామా .. ఏ మోడల్ కావాల్నో?
  • మేడిగడ్డ బరాజ్ కుంగితే కాంగ్రెస్ నేతలు సంబురాలు చేస్కున్రు
  • మీట్ ది ప్రెస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: బీజేపీ బీసీ సీఎం ప్రకటనపై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కులం కాదు గుణం ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని తొలగించిన బీజేపీ ఇప్పుడు బీసీ సీఎం అంటోందన్నారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవుతాడని చెప్పి ఎన్నికలకు వెళ్లి గ్రాండ్ సక్సెస్ అయ్యామని చెప్పారు. ఇప్పుడు తమ తలరాత ప్రజల చేతుల్లో ఉందని కేటీఆర్ అన్నారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమాలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంటున్నారని, అది నిజం కాదని పేర్కొన్నారు. అన్ని పోటీ పరీక్షలు రాస్తున్నది కేవలం12 లక్షల మందేనని చెప్పారు. మాట్లాడితే కాంగ్రెస్ కర్నాటక మోడల్ అంటోందని, దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామని కాంగ్రెస్, బీజేపీ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 2014కు ముందున్న తెలంగాణ ఇప్పుడు లేదని, ఈ తొమ్మదేండ్లలో భారతదేశానికి రోల్ మోడల్ అయ్యిందని అన్నారు. 

తలసరి ఆదాయంలో మనమే నంబర్ 1 స్థానంలో ఉన్నామని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా కరువు, కర్ఫ్యూ లేదని వివరించారు. కేసీఆర్ అప్పు చేసిన ప్రతిపైసా ఉత్పాదక రంగంలోనే పెట్టారని కేటీఆర్ వివరించారు. కర్నాటకలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని, అక్కడి రైతులు కాంగ్రెస్ కు ఓట్లు వేసినందుకు చెంపలేసుకుంటున్నారని అన్నారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, తాము 1.30 లక్షల కొలువులు ఇచ్చామని చెప్పారు. ఓట్ల కోసం అర్రస్ పాటలాగా వ్యవహరించొద్దని, అభివృద్ధిపై ఒక విజన్ ఉండాలని అన్నారు.

ALSO READ : కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ సెల్ చైర్మన్ సోహేల్ రాజీనామా

కర్నాటక పోయి తేల్చుకుందాం పా.. ఒకే బస్సులో పోయి అక్కడి రైతులను అడుగుదాం.. కర్నాటక మోడల్ కావాల్నా.. తెలంగాణ మాఓడల్ కావాల్నా వస్తారా అంటూ విలేకరులను ప్రశ్నించారు కేటీఆర్. ప్రజలు ఓటు వేయడంలో తప్పు చేస్తే కష్టపడి సాధించుకున్న తెలంగాణ యాభై ఏండ్లు వెనక్కిపోతుంది అని అన్నారు. తాము నిజంగా ప్రతీకార రాజకీయాలు చేస్తే పీసీసీ చీఫ్ జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేవారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని కేటీఆర్ చెప్పారు. ట్రెండ్స్ ను తాము కూడా క్రియేట్ చేయగలమని, అవన్నీ సోషల్ మీడియా ఫేక్ ఫ్యాక్టరీ న్యూస్ అని అన్నారు.