పాలన చేతగాకుంటే రాజీనామా చెయ్ : కేటీఆర్

పాలన చేతగాకుంటే రాజీనామా చెయ్ : కేటీఆర్
  • రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడకు: కేటీఆర్
  • రాష్ట్రాన్ని, కేసీఆర్‌‌‌‌ను తిడితే నాలుక చీరేస్తం
  • మేం ఆదాయం పెంచి రాష్ట్రాన్ని అప్పజెప్పినం 
  • బంగారు తెలంగాణను సీఎం రేవంత్ 
  • 17 నెలల్లోనే అస్తవ్యస్తం చేశాడని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డికి పాలన చేతగాక కాడి కింద పడేశారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​మండిపడ్డారు. ఆయనకు పాలన చేతగాకుంటే రాజీనామా చేసి అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ ​చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. నాయకత్వ లోపం.. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రానికి పెట్టిన అతిపెద్ద శాపమని అన్నారు. 

అసలు తండ్రి లాంటి ముఖ్యమంత్రే రాష్ట్రానికి శాపాలు పెట్టడం స్వతంత్ర భారతదేశంలోనే లేదు. దేశ చరిత్రలోనే రేవంత్​రెడ్డి అసమర్థ సీఎం. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత సులువు కాదు. రాష్ట్రం దివాలా తీసిందంటూ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారు. దివాలా అంటూనే మరోవైపు తెలంగాణ రైజింగ్​అంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవు గానీ.. అందాల పోటీలకు మాత్రం రూ.200 కోట్లు ఉన్నాయా? కాంగ్రెస్​పార్టీ మేనిఫెస్టో ఈ శతాబ్దపు మోసం” అని కేటీఆర్​ మండిపడ్డారు. 

పాలన చేతగాక రాష్ట్రాన్ని తిడతామంటే ఊరుకోబోమని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను తిడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్​లాంటి ఎర్రి పార్టీ.. దొంగ చేతికి తాళాలిచ్చింది. రేవంత్‌‌‌‌ను సీఎం చేసి ఏఐసీసీ, రాహుల్​గాంధీ చాలా పెద్ద తప్పు చేశారు. రేవంత్​గురించి రాహుల్‌‌‌‌కు లేట్‌‌‌‌గా అర్థమైంది. అందుకే దగ్గరకు రానివ్వట్లేదు” అని అన్నారు. ‘‘చెప్పులు ఎత్తుకెళ్లేంత దొంగలా నిన్ను (రేవంత్ రెడ్డి) ఎందుకు చూస్తున్నారు? దొంగని దొంగ అనే అంటారు. ఓటుకు నోటు కేసులో పైసల బ్యాగుతో అడ్డంగా దొరికావు. రేవంత్​దొంగ కాబట్టే.. అప్పు పుట్టడం లేదు” అని కేటీఆర్​ అన్నారు. 

ఉద్యోగులను అవమానించారు.. 

ఢిల్లీ పార్టీలను నమ్మవద్దని ప్రజలకు కేసీఆర్​చిలకకు చెప్పినట్టు చెప్పారని, ఎన్నికలప్పుడు కేసీఆర్​చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యమయ్యాయని కేటీఆర్​అన్నారు. ‘‘రేవంత్​అసమర్థ, దక్షత లేని సీఎం అని ఆయన చేసిన వ్యాఖ్యలతోనే తేలిపోయింది. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి, ఇప్పుడు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగుల త్యాగాలపై ఎన్నో మాట్లాడిన రేవంత్‌‌‌‌.. ఇప్పుడెలా మాట్లాడుతున్నారు? ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అవమానిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా ఆయన మాట్లాడారు. అయినా ఉద్యోగులు అడిగింది మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే కదా. 

రిటైర్​అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్​ఇచ్చేందుకు కూడా పైసలు లేవా? ప్రభుత్వ ఉద్యోగుల మీద సీఎం అక్కసు వెళ్లగక్కారు. గొంతెమ్మ కోర్కెలంటూ అవమానించారు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యిమని అడిగితే.. సెక్రటేరియెట్ ముందు దుశ్శాసన పర్వాన్ని ఆవిష్కరించిండు. దుర్మార్గపు సీఎం ఆలోచన విధానాన్ని ఉద్యోగ సంఘాలు అర్ధం చేసుకోవాలి. ఆదాయం పెరిగిన రాష్ట్రాన్నే మేం కాంగ్రెస్​చేతిలో పెట్టాం. శ్వేతపత్రం పెట్టినప్పుడు.. బీఆర్ఎస్​రూ.6 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. 

ఇప్పుడేమో రూ.8.50 లక్షల కోట్ల అప్పు చేసిందంటున్నారు. రేవంత్​సర్కార్ నడుపుతున్నరా? లేక సర్కస్​నడుపుతున్నరా? కాంగ్రెస్​ సర్కార్ ​రాష్ట్రానికి రూపాయి కూడా ఆదాయం పెంచలేకపోయింది. అసలు 17 నెలల రేవంత్‌‌‌‌ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు. తెలంగాణను 17 నెలల పాలనలోనే రేవంత్​అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. హెలికాప్టర్ల కోసం ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారన్నారు. 

దివాలా తీసిందని బజారున పెట్టుకుంటరా? 

రాష్ట్రం దివాలా తీసిందని ఎవరైనా బజారున పెట్టుకుంటారా? అని కేటీఆర్​ప్రశ్నించారు. రూ.170 కోట్లు లంచం ఇచ్చి, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకునే దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదన్నారు. ‘‘ఢిల్లీకి పోతే అపాయింట్‌‌‌‌మెంట్​ఇస్తలేరని సీఎం అంటున్నారు. కానీ 43 సార్లు ఢిల్లీకి పోయినా రూ.43 కూడా తీసుకురాలేకపోయారు” అని విమర్శించారు. ‘‘రేవంత్​రెడ్డి పనికొచ్చే ఒక్క మంచి పనీ చేయలేదు. రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడుతున్నారు. 

మరి సీఎం రేవంత్​రెడ్డి కుటుంబ సభ్యుల ఆదాయం ఎలా పెరుగుతున్నది? రూ.వేల కోట్లతో ఫార్మా కంపెనీ పేరిట లగచర్ల భూములు గుంజుకున్నరు. రేవంత్​రెడ్డి వియ్యంకుడి అప్పులన్నీ రైటాఫ్​అయిపోయాయి. జూబ్లీహిల్స్​ప్యాలెస్​మూడింతలు పెరిగింది. 2 వేల ఎకరాలు కొన్నారు. రేవంత్​రెడ్డి తన సీక్రెట్స్​ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఆదాయం ఎందుకు తగ్గుతున్నది.. రేవంత్​ కుటుంబ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి?’’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అడగొద్దని ప్రజలకు రేవంత్​చెబుతున్నారని, పెట్రోల్​ రేటును రూ.200 చేస్తామంటున్నారని మండిపడ్డారు. అడ్డగోలు వ్యాఖ్యలు మాని రాష్ట్ర సంపద పెంచే ఆలోచన చేయాలన్నారు.