ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరం: KTR

ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరం: KTR

ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వరలించినట్లు ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  అన్నారు. సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనపై  తెలంగాణ భవన్ లో  మీడియాతో మాట్లాడుతూ.. లీడర్లు పార్టీలు మార్చే విధానాన్ని ప్రోత్సహించేంది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. 2004 లో టీఆర్ఎస్ పార్టీ తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ , ఆ తర్వాత గెలిచిన  10 మంది టీఆర్ఎస్  ఎమ్మెల్యేలను  కాంగ్రెస్ లో కలుపుకోలేదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ చేస్తున్న దీక్షకు మద్ధతు తెలుపుతున్న టీడీపీ నాయకులు ఒకప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారడంపై ఎందుకు ప్రశ్నించరు అని అడిగారు. రేవంత్  రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లోకి ఎలా చేరారు ? అని ప్రశ్నించారు.  ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు ఎందుకు అడగలేదన్నారు. మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పనడం సరికాదన్నారు  కేటీఆర్.

వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ పార్టీతో కలిసి వస్తాం అంటే మేము వద్దనలేం కదా అని అన్నారు. పార్టీ మార్పులు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని, అవే మార్పులు రాష్ట్రంలోనూ జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ బద్ధంగానే విలీనం జరిగినట్లు స్పీకర్ ప్రకటించారని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.